india-england-3rd-test-match-mohaliమొహాలీ వేదికగా ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో తొలి రెండు రోజులు ముగిసే సమయానికి రసకందాయంలో పడింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులు చేసి ఆలౌట్ కాగా, తన తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కూడా తడబడింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసి ఇంకా 12 పరుగుల దూరంలో ఉంది.

ఇండియన్ బ్యాట్స్ మెన్లలో పార్థివ్ పటేల్ 42, పుజారా 51, కోహ్లి 62 రాణించగా, అశ్విన్ 57, రవీంద్ర జడేజా 31 క్రీజులో నిలిచారు. ఒకానొక దశలో 148 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ దిశగా సాగుతున్న టీమిండియాను స్పిన్నర్ రషీద్ దెబ్బ తీసాడు. పుజారా, రహనేలను వెనువెంటనే రషీద్ పెవిలియన్ పంపగా, తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కరణ్ నాయర్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

దీంతో 156 పరుగులకు సగం మంది బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కు చేరుకోవడంతో కష్టాల్లో ఉన్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, స్పిన్నర్ అశ్విన్ లు ఆదుకున్నారు. కోలుకుంటున్న దశలో కోహ్లి 62 పరుగులకు వెనుదిరగడంతో మళ్ళీ చాప చుట్టేయడం ఖాయమని భావించిన ప్రేక్షకులకు ఈ సారి జడేజా పర్వాలేదనిపించారు. వరుసగా బ్యాటింగ్ లో వైఫల్యం చెందుతున్న జడేజా రాణించడంతో మరో వికెట్ నష్టపోకుండా రెండవ రోజును ముగించింది.

అయితే ఇంకా 12 పరుగులు వెనుకబడి ఉన్న టీమిండియా చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మూడవ రోజు ఆట కీలకంగా మారింది. భారత వికెట్లు తీసేసి ఆధిక్యం పెద్దగా లేకుండా చూస్తే మ్యాచ్ ఇంగ్లాండ్ వైపుకు తిరిగే అవకాశం కనపడుతోంది. అలా కాకుండా చెప్పుకోదగ్గ ఆధిక్యం ప్రదర్శిస్తే… మరోసారి భారత్ పైచేయి సాధించే సంకేతాలు కనపడుతున్నాయి. మ్యాచ్ ఎవరిదీ అన్నది మూడవ రోజు ఆట స్పష్టంగా చెప్పేయబోతోందన్న మాట!