India Beat New Zealand in Kanpur!వరుసగా ఆరు వన్డే సిరీస్ లను కైవసం చేసుకుని మాంచి ఊపు మీదున్న టీమిండియాకు షాక్ ఇద్దామని భావించిన న్యూజిలాండ్ ఆశలు నెరవేరలేదు. విజయపు అంచుల దాకా వచ్చిన కివీస్ ను టీమిండియా బౌలర్లు నిలువరించడంలో సక్సెస్ అయ్యారు. పూర్తి బ్యాటింగ్ పిచ్ పైన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో… చివరి 4 ఓవర్లలో మ్యాచ్ ను టీమిండియా వైపుకు తిప్పడంలో బూమ్రా, భువనేశ్వర్ కుమార్ ల జోడి మరోసారి విజయవంతం అయ్యింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణయం తప్పు అనే విధంగా టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి నిరూపించారు. శిఖర్ ధావన్ (14) పరుగులకే ఔటైనప్పటికీ, రోహిత్ – విరాట్ ద్వయం రెండవ వికెట్ కు ఏకంగా 230 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా 337 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఓపెనర్ రోహిత్ శర్మ మరో డబుల్ సెంచరీ చేసేస్తాడేమోనని భావిస్తున్న తరుణంలో భారీ షాట్ కు ప్రయత్నించి 147 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు.

అయితే అప్పటికే కివీస్ బౌలర్లు వేసిన బంతులకు కళ్ళు చెదిరే షాట్లు కొట్టి వీక్షకులను ముగ్ధమనోహరులను చేసారు. రోహిత్ శర్మ కొట్టిన షాట్లకు మరో ఎండ్ లో ఉన్న సెంచరీల వీరుడు విరాట్ కోహ్లి సైతం చప్పట్లో అభివాదాలు చేసారంటే… ఆ షాట్లు ఏ రేంజ్ లో అర్ధం చేసుకోవచ్చు. రోహిత్ శర్మ ఆడితే ఇలా ఉంటుంది… అని మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటిచెప్పే విధంగా తనదైన స్టైల్ బ్యాటింగ్ తో టీమిండియా సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక ఎంత ప్రెషర్ ఉంటే అంత బాగా రాణించే కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రోహిత్ కు అండగా నిలవడంతో పాటు మరో సెంచరీని తన ఖాతాలో వేసుకుని, తాను మాటల కెప్టెన్ కాదు, చేతల కెప్టెన్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక చివర్లో ధోని (25), జాదవ్ (18) పరుగులు చేసి… చివరికి టీమిండియా స్కోర్ ను 337 పరుగులకు చేర్చారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు తొలుత గుప్తిల్ (10) వికెట్ ను కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ మున్రో (75), వన్ డౌన్ బ్యాట్స్ మెన్ విలియమ్సన్ (64) రాణించడంతో విజయం దిశగా అడుగులు వేసారు. ప్రమాదకరంగా మారిన వీరిద్దరిని స్పిన్నర్ చాహల్ స్వల్ప విరామంలో పెవిలియన్ కు పంపించడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది. అయితే ఆ తర్వాత టేలర్ (39), లతం (65)లు కూడా అద్భుతంగా రాణించి కివీస్ కు విజయాన్ని అందించినంత పని చేసారు.

చివరి 4 ఓవర్లలో విజయానికి కేవలం 35 పరుగులు మాత్రమే కావాల్సి ఉన్న తరుణంలో… తొలి విభాగంలో పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ తన డెప్త్ బౌలింగ్ ప్రతిభ ఏంటో మరోసారి నిరూపిస్తూ ప్రమాదకరమైన నికోలస్ ను (37) పెవిలియన్ పంపాడు. అయినప్పటికీ మరో ఎండ్ లో వికెట్ కీపర్ లతం విధ్వంసకరమైన బ్యాటింగ్ తో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడుతున్న దరిమిలా, తదుపరి ఓవర్లో బూమ్రా లతంను రనౌట్ చేసి కివీస్ ఆశలకు బ్రేక్ వేసాడు.

లాస్ట్ ఓవర్ వచ్చేపాటికి 15 పరుగులు కావాల్సి ఉండగా, బూమ్రా అద్భుతమైన యార్కర్లను సంధించడంతో…. కేవలం 8 పరుగులు మాత్రమే లభించాయి. అది కూడా చివరి బంతి ఫోర్ గా వెళ్ళడం వలన! ఫుల్ బ్యాటింగ్ పిచ్ పైన బూమ్రా తన 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కొట్టేసాడు. అలాగే స్పిన్నర్ చాహల్ కూడా 47 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి సిరీస్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

బ్యాటింగ్ విభాగంలో రోహిత్ – విరాట్, బౌలింగ్ విభాగంలో బూమ్రా – చాహల్ లు విశేషంగా రాణించారు. ఈ ఉత్కంఠ పోరులో చివరికి విజయం టీమిండియా సొంతం కావడంతో… వరుసగా 7 సిరీస్ లను నెగ్గిన రెండవ జట్టుగా (ఆస్ట్రేలియా తర్వాత) టీమిండియా నిలిచింది. అలాగే టీమిండియా కెప్టెన్ గా 7 వన్డే సిరీస్ విజయాలను సొంతం చేసుకున్న కెప్టెన్ గా కూడా విరాట్ కోహ్లి సరికొత్త రికార్డులను అందుకున్నాడు.