India beat England to win third T20 ఫైనల్ ప్రెజర్ లో ఉన్న ఇంగ్లాండ్ ను మట్టికరిపించి, టీమిండియా జయకేతనం ఎగురవేసి సిరీస్ ను 2-1 తేడాతో గెలుపొందింది. దీంతో విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టు టెస్ట్ మ్యాచ్ లను 4-0తో, వన్డే సిరీస్ ను 2-1తో, టీ20 సిరీస్ ను కూడా దక్కించుకుని, ఇంగ్లాండ్ ను ఒట్టి చేతులతో వెనక్కి పంపించింది. కీలకమైన మూడవ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ అప్పగించి, అతిపెద్ద తప్పు చేసిందనే చెప్పాలి. ఫైనల్లో సాధారణంగా ముందు బ్యాటింగ్ చేసిన జట్టుకే ఎక్కువ అవకాశం ఉంటుందన్న విషయం, అంతకు ముందు వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడిన ఇండియా జట్టుకు బాగా తెలుసు.

ఇక, బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది. రైనా 63, ధోని 56 అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు ఇవ్వగా, చివర్లో యువరాజ్, పాండ్యలు బ్యాట్ జులిపించడంతో స్కోర్ 200 మార్క్ దాటగలిగింది. లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ ఆది నుండి తడబడింది. బిల్లింగ్స్ వికెట్ ను వెంటనే చేజార్చుకున్నప్పటికీ, రాయ్ – రూట్ లు ధాటిగా ఆడుతూ టీమిండియాకు గట్టిబదులిచ్చే విధంగా కాసేపు హడలెత్తించారు. రాయ్ 32 పరుగులు చేసి అవుటైనప్పటికీ, మోర్గాన్ 21 బంతుల్లోనే 40 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

లక్ష్యాన్ని చేధించే దిశగా సాగుతున్న ఇంగ్లాండ్ కు బ్రేకులు వేసాడు స్పిన్నర్ చాహల్. 119 పరుగులకు కేవలం 2 వికెట్లు కోల్పోయి స్ట్రాంగ్ గా ఉన్న ఇంగ్లాండ్ వెన్నువిరిచాడు. చాహల్ దెబ్బకు ఇంగ్లాండ్ 127 పరుగులకే పేకమేడలా కుప్పకూలిపోయిందంటే, ఏ స్థాయిలో బ్యాట్స్ మెన్లు ఒత్తిడికి గురయ్యారో చెప్పుకోవచ్చు. తానూ వేసిన 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చిన చాహల్, ఏకంగా 6 వికెట్లతో సత్తా చాటాడు. టీ 20లలో టీమిండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. చివరి 8 వికెట్లను 19 బంతుల్లో 8 పరుగులు చేసి కోల్పోయింది.

ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు బౌలర్లకే దక్కడం విశేషం. బ్యాట్స్ మెన్ల దూకుడు ఆటగా భావించే టీ20లలో బౌలర్లు సత్తా చాటుతూ జట్లకు విజయాలు అందిస్తుండడం విశేషమే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా చాహల్ నే వరించింది. మొత్తమ్మీద తొలి టీ20లో ఓటమి పాలై, చివరి రెండు మ్యాచ్ లను గెలుచుకుని, సిరీస్ ను వశం చేసుకోవడం పట్ల జట్టు సారధి కోహ్లిని అభినందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిసింది. అయితే టీ20 సిరీస్ లో కోహ్లి నాయకత్వంతో పాటు ధోని సహాయ సహకారాలు చాలా ఉన్నాయన్న విషయం మ్యాచ్ లను తిలకించిన వారికి తెలిసిన విషయమే.