Indain surgical strike 2 on Pakistan a dare attempt-పుల్వామా ఉగ్రదాడి జరిగిన సరిగ్గా 12 రోజుల తర్వాత భారత్‌ ప్రతీకారానికి ఉపక్రమించింది. నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై 1000 కిలోల బాంబులతో 300 మంది ముష్కరులను మట్టుపెట్టింది. అయితే 1971లో బాంగ్లాదేశ్ కోసం చేసిన యుద్ధం తరువాత పాకిస్తాన్ భూభాగంలో కి భారత యుద్ధ విమానాలు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1999లో పాక్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధంలోనూ భారత యుద్ధ విమానాలు అంతర్జాతీయ సరిహద్దును దాటలేదు.

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్ర శిబిరాల్లో బాలాకోట్‌ అతి పెద్దది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం దాడికి దిగింది. బాలకోట్ మాత్రమే కాకుండా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌, చకోటి ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలపై కూడా భారత్‌ దాడులు జరిపిందని సమాచారం. దేశవ్యాప్తంగా ఈ దాడుల పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ దాడులను స్వాగతించాయి. ఉగ్రవాద నిర్మూలనకు చేపట్టే అన్ని చర్యలకు ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి.

మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ అయ్యింది. దాడిపై పాకిస్థాన్‌ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇస్లామాబాద్‌లో అత్యవసర భేటీకి పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ సమన్లు జారీ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ మాదిరిగా మిన్నకుండి పోతుందా లేక కయ్యానికి కాలు దువ్వుతుందా అనేది చూడాలి. భారత్ పై దాడి లేక యుద్ధానికి వెళ్లాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఒత్తిడి ఎక్కువగా ఉంది.