Income Tax rides on TDP Leader Magunta Sreenivasulu Reddyతెలుగుదేశం నేతలపై కేంద్ర సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల సందర్భంగా కొంత బ్రేక్ ఇచ్చాకా పోలింగైన మరునాడే మరో టీడీపీ నేత టార్గెట్ గా ఐటీ దాడులు జరిగాయి. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన బాలాజీ గ్రూప్‌ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. చెన్నై టీనగర్‌లో కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీలో సోదాలు చేస్తున్నారు. ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు.

మాగుంట కుటుంబానికి చెందిన బాలాజీ బిస్లరీ, బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎండ్రికా ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అయితే మాగుంట కుటుంబీకుల నివాసాలకు వెళ్లకపోయినప్పటికీ, ఆ కుటుంబానికి చెందిన మూడు కంపెనీలు, అదేవిధంగా వారి సన్నిహితులకు సంబంధించిన ఏడు కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుండి వచ్చిన మాగుంట టీడీపీ తరపున ఒంగోలు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.

తరువాత ఆయనను పార్టీ ఎమ్మెల్సీని చేసింది. కాబినెట్ బెర్త్ ఆశించి భంగపడ్డారు ఆయన. అయితే గత కొద్ది కాలంగా ఆయన పార్టీ పట్ల సానుకూలంగా లేరని పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ లోగానే ఈ దాడులు జరుగుతున్నాయి. దీనితో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి. టీడీపీ ఎన్డీయే నుండి వైదొలిగిన నాటి నుండీ ఆ పార్టీ నేతలపై కేంద్ర సంస్థల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.