Income Tax Raids on Megha Engineering & Infrastructures Limitedఇటీవలే పోలవరం రివర్స్ టెండరింగ్ లో అత్యల్ప టెండర్ వేసిన మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో కాంట్రాక్టుల్లో వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కలు సరిగా చూపలేదన్న సమాచారంతో ఐటీ శాఖ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. సోదాలకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఐటీ శాఖ అధికారులు నిరాకరించారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. దీనిపై మేఘ సంస్థ కూడా స్పందించింది.

సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయని పేర్కొంది. రెండేళ్లకోసారి ఐటీ శాఖ అధికారులు ఇలా తనిఖీలు నిర్వహించడం గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని తెలిపింది. మీడియాకు పంపిన మెస్సేజ్ లో వీటిని రొటీన్ తనిఖీలుగానే చూడాలనే ఎటువంటి కవరేజ్ ఇవ్వకూడదని రిక్వెస్ట్ చేసింది. అయితే ఇప్పుడు దీని మీద వివాదాలు చెలరేగుతున్నాయి.

మేఘ కంపెనీ ఇటీవలే టీవీ9లో షేర్ కొన్న విషయం తెలిసిందే. తమ దాకా వస్తే గానీ తెలియరాలేదని, వేరే వారి మీద రొటీన్ గా సోదాలు జరిగినా ప్రతీ పదినిముషాలు ఒకసారి టీవీలో చెప్పే టీవీ9 యజమాని ఇప్పుడు తమ విషయంలో మాత్రం సమన్వయంతో వ్యవహరించాలని మిగతా మీడియాని రిక్వెస్ట్ చెయ్యడాన్ని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.