Income Tax Raids on CM Rameshతెలుగు దేశం నాయకులపై ఐటీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు దేశంకు ఎక్కువగా నిధులు ఇచ్చే నాయకులనే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తున్న ఈ దాడులు తాజాగా రాజ్యసభ సభ్యుడు, సీఎం రమేష్ పై జరుగుతున్నాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ ఆరోపిస్తుంటే బీజేపీ మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని అంటుంది.

అవినీతి నిర్మూలనలో భాగంగా అవినీతిపై యుద్ధం చేస్తుంది మోడీ ప్రభుత్వం అని చెప్పుకొస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఐటీ దాడులు ఇప్పుడు చేయకుండా తమతో కలిసిఉన్నప్పుడే చేసి ఉంటే బిజెపి నిజాయితీ రుజువై ఉండేది. అవినీతిపై పోరు నిజమని ప్రజలు నమ్మి ఉండేవారు. రాజకీయంగా కూడా అద్భుతంగా కలిసొచ్చేది!

ఇప్పుడు చేయడం రాంగ్ టైమింగ్ అనే అనాలి. ఇది కక్ష సాధింపు అని ప్రచారం చేసుకునే అవకాశం టీడీపీ నాయకులకు ఇచ్చేసారు కూడా. దీనినే క్రికెట్ భాష లో హిట్ వికెట్ అంటారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కు టీడీపీ ఎక్కడ ఆర్ధిక సాయం చేస్తుందో అనే అనుమానంతో ఈ దాడులు చేయిస్తున్నట్టు కొందరి అనుమానం.

గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ కు ఆర్ధిక మద్దతు ఇచ్చే వారిపై దాడులు చేసింది ఐటీ డిపార్టుమెంటు. అయితే అప్పట్లో అది కాంగ్రెస్ కు బెనిఫిట్ అయ్యింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇటువంటి వాతావరణంలో ఈ దాడులలో నిజంగా ఏమైనా పట్టుబడతాయా అంటే ఆశ్చర్యమే. దాడులు చేసే అవకాశం ఉండటంతో అందరు ఒకింత జాగ్రత్తగానే ఉండే అవకాశం ఉంది.