Megha Engineering and Infrastructure Limited-ఇటీవలే పోలవరం రివర్స్ టెండరింగ్ లో అత్యల్ప టెండర్ వేసిన మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో నిన్న ఉదయం నుండి జరుగుతున్న సోదాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. నిన్న రాత్రి రెండు కొత్త టీంలను కూడా రప్పించింది ఐటీ డిపార్టుమెంట్.

ఇది ఇలా ఉండగా ఏమైందో ఏమో గానీ ఉన్నఫళంగా ఈరోజు ఏకంగా సీఆర్ఫీఎఫ్ బలగాలను రప్పించారు. తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల రాష్ట్రానికి చెందిన అధికారులను గానీ పోలీసులను గానీ పూర్తిగా దూరం పెట్టారు. ఏమైనా అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా దాదాపుగా తెలుగు మీడియా ఈ రైడ్స్ ని గురించి వార్తలు ప్రసారం చెయ్యకపోవడం విశేషం. మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సన్నిహితుడు కావడమే ఇందుకు కారణం అంటున్నారు. గత ఎన్నికలలో తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు భారీగా ఫండ్స్ ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సహజంగా ఇటువంటి వార్తల ప్రసారంలో ముందు ఉండే టీవీ9 లో ఇటీవలే కృష్ణారెడ్డి మేజర్ షేర్ కొనుగోలు చేశారు.

నిన్న ఈ రైడ్స్ పై మేఘ సంస్థ కూడా స్పందించింది. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇవి జరుగుతున్నాయని పేర్కొంది. రెండేళ్లకోసారి ఐటీ శాఖ అధికారులు ఇలా తనిఖీలు నిర్వహించడం గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని తెలిపింది. అయితే సోదాలు జరుగుతున్న తీరు చూస్తే ఇవి సాధారణమైనవిగా కనిపించడం లేదు.