KCR - KTR - IT returnsతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో నామినేషన్ సమయంలో డిక్లేర్ చేసిన ఆస్తులకు… 2018 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల సమయంలో డిక్లేర్ చేసిన ఆస్తులకు మధ్య చాలా తేడా ఉందని.. అలాగే పెరిగిన ఆస్తులను ఐటీ రిటర్న్ లో చూపించలేదని… దీని మీద సంజాయిషీ ఇవ్వాలని డిపార్టుమెంటు ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

కేసీఆర్ ఆస్తి 2014లో రూ. 15.16 కోట్లుండగా… 2018 ఎన్నికల అఫిడవిట్ నాటికి అది రూ. 23.55 కోట్లకు చేరింది. కేసీఆర్ ఆదాయంలో ఎక్కువ భాగం ఆయన ఫార్మ్ హౌస్ లో చేసే వ్యవసాయం నుండే. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పని చేసిన కేటీఆర్ ఆస్తి నాలుగేళ్ల కాలంలో రూ. 7.98 కోట్ల నుంచి రూ. 41.83 కోట్లకు పెరిగింది. అలాగే ఓ పాతిక మంది ఎమ్మెల్యేలు.. కూడా.. ఈ నాలుగేళ్లలో వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ను మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వారికి కూడా నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.

ఈ వార్త గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల తరువాత ఎన్డీయేకు గనుక సీట్లు తక్కువ అయితే తెరాస చేరవచ్చని వార్తలు వస్తున్న తరుణం ఈ నోటీసులు ప్రాధాన్యత సంతరించుకుంది. తెరాస నయానోభయానో దారికి తెచ్చుకోవడమే ఈ నోటీసుల ముఖ్య ఉద్దేశమని ఆ పార్టీ నేతలే భావిస్తున్నారు. తెలంగాణలోని 16 సీట్లకు గానూ 16 గెలుచుకుంటామని తెరాస ధీమాగా ఉంది. ఒకవేళ అదే జరిగి కేంద్రంలో హంగ్ పరిస్థితి ఉంటే తెరాస దేశరాజకీయాలలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది.