income-tax-10-for-income-above-4-lakhsనోట్ల రద్దు నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించగా, అందరినీ ఇన్ కం టాక్స్ పరిధిలోకి తీసుకువచ్చి, ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేయించడం ద్వారా దేశానికి ఆదాయాన్ని సమకూర్చాలన్న ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉన్న డబ్బంతా బ్యాంకులకు చేరిపోవడంతో… 2.50 లక్షలకు మించిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే దీనిపై కొంత ఊరటనిచ్చే ప్రకటనను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుందన్న సమాచారం జాతీయ మీడియా వర్గాల్లో ప్రధానంగా వినపడుతోంది.

ప్రస్తుతం 2.50 లక్షలుగా ఉన్న కనీస ఆదాయపన్నును 4 లక్షల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని, 4 లక్షల నుండి 10 లక్షల లోపు వారు 10 శాతం పన్ను చెల్లించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సమాచారం. అలాగే 10-15 లక్షల మధ్య ఆదాయం కలిగి ఉన్న వారు 15 శాతం, 15-20 లక్షల మధ్య కలిగి ఉన్న వారు 20 శాతం, 20 లక్షలు ఆ పైన ఉన్న వారు 30 శాతం చెల్లించే విధంగా టాక్స్ నిబంధనలు సిద్ధమవుతున్నాయన్న సమాచారం ప్రధానంగా వినపడుతోంది.

నిజానికి గత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలోనే 5 లక్షల వరకు మినహాయింపు ఇస్తారన్న వార్తలు వినిపించాయి. కానీ, అందరికీ మొండిచేయి చూపిస్తూ ఎలాంటి ప్రకటన లేకుండా పాత శ్లాబ్ నే కేంద్ర ప్రభుత్వం కొనసాగించింది. అయితే ప్రస్తుతం దేశంలో ఏర్పడిన పరిస్థితుల రీత్యా, ఈ సారి పన్నుల చట్టాన్ని సవరించక తప్పని పరిస్థితులు నెలకొనడంతో 4 లక్షల వరకు మినహాయింపు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో 4 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్న వారు నిరభ్యంతరంగా ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేసుకోవచ్చన్న మాట.