in which condition mahesh babu was ఈ సంక్రాంతికి అభిమానులకు ఎలాంటి అప్ డేట్ ఇవ్వాలి. ఫ్యాన్స్ ఎప్పటినుండో అడుగుతున్న “సర్కార్ వారి పాట”కు సంబంధించిన మొదటి పాటను రిలీజ్ చేద్దామా? లేక ఓ టీజర్ ను పరిచయం చేద్దామా? అనే ఆలోచనలు చేయాల్సిన మహేష్ మది అంతా ప్రస్తుతం బరువెక్కిపోయింది.

ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో నటించిన పాటను వినేద్దామా? టీజర్ ను చూసేద్దామా? ‘సర్కార్ వారి పాట’ సంగతులు తెలుసుకుందామా? అన్న ఆతృతలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అది నిన్నటి వరకు! నేటి పరిస్థితి పూర్తిగా భిన్నం. అసలు మహేష్ ఎలా ఉన్నారు? అన్నదే వారి ఆవేదన.

కరోనా సోకడం… అదే సమయంలో అన్నయ్య తుది శ్వాస వీడడం… కనీసం కడసారి వీక్షించడానికి కూడా అవకాశం లేకపోవడం… కాలం రాసిన రాతను ఎవరూ తప్పించలేరంటే ఇదేనేమో! అన్నయ్యను పోగొట్టుకున్న మా మహేష్ ఏ స్థితిలో ఉన్నారనదే అభిమానుల ఆలోచన.

తాను పడుతోన్న బాధను ప్రత్యక్షంగా చూపించలేకపోయినా… అక్షర రూపంలో పెట్టి తన సోదరుడు అంటే తనకు ఎంత ప్రాముఖ్యమో మహేష్ చెప్పకనే చెప్పారు. తన ఆవేదన, ప్రేమ, అభిమానంతో కూడిన ఈ ఏమోషనల్ సందేశం అభిమానుల హృదయాలను కరిగిస్తోంది.

“నాకంటూ మరో జన్మ ఉంటే ఖచ్చితంగా నువ్వే నా అన్నయ్య” అంటూ మహేష్ ఇచ్చిన చివరి లైన్ ఒక్కటి చాలు… తనకు రమేష్ అంటే ఇష్టమో చెప్పడానికి! ఇక్కడ నుండి మహేష్ ఎంత త్వరగా కోలుకుని బయటకు వస్తారనేదే అభిమానులకు తీరని వేదనగా మారుతోంది.

ఎందుకంటే కుటుంబానికి మహేష్ బాబు ఇచ్చే ప్రాధాన్యత ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరం హీరోలలో మహేష్ కు మించి ఫ్యామిలీతో అంత సమయం గడిపే మరో హీరో ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉంటే షూటింగ్, లేదంటే ఫ్యామిలీ… ఈ రెండే మహేష్ ప్రపంచం.

మహేష్ సినిమాలు రిలీజ్ అయినపుడు మరియు పండగల సమయంలో కుటుంబమంతా ఒక చోట చేరి సెలెబ్రేట్ చేసుకోవడం పరిపాటి. బహుశా ఈ విషాదం జరగకపోతే సంక్రాంతి పర్వదినం ఘట్టమనేని ఇంట మరోలా ఉండేదేమో! కానీ ఇపుడు మాత్రం అంతా నిశ్శబ్దం.

తనకు అన్నీ అయిన అన్నను మిస్ చేసుకున్న మహేష్ మానసికంగా మరింత దృఢంగా ఉండి, త్వరగా కోలుకుని బయటకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మహేష్ ఎలా ఉన్నారో అన్న ఫోటో ఒక్కటైనా బయటకు వస్తే చూడాలనేది అభిమానుల ఆకాంక్ష.