if the rulers lack vision that was andhra pradeshరాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సం.లైన సందర్భంగా నేడు ఘనంగా వజ్రోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడం ర్యాలీలను జరుపుకొంటున్నాము. ప్రజలందరూ కలిసికట్టుగా ఈ వేడుకలు జరుపుకొంటుండటం చాలా సంతోషమే.

కానీ దేశంలో మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం స్థితి నేడు ఏవిదంగా ఉంది? రాష్ట్రంలో ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి జరిగిందా?రాష్ట్రంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారా?అని ప్రశ్నించుకొంటే అన్నిటికీ ఒకటే సమాధానం ‘లేదు’ అని చెప్పుకోవలసివస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అంటే హైదరాబాద్‌ అభివృద్ధి అన్నట్లు పాలకులు వ్యవహరించడం వలన రాష్ట్రవిభజనతో రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు రాజకీయాలతో అడ్డుకట్ట పడింది.

ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అభివృద్ధికి అర్దం కూడా మారిపోయింది. అభివృద్ధి అంటే సంక్షేమమనే భావనతో పరిపాలన సాగుతుండటంతో అప్పుల రాజ్యం… ఇష్టారాజ్యం అన్నట్లు సాగిపోతోంది. తమ విధానాలే సరైనవని, ఈ భ్రమలోనే ప్రజలు జీవించాలని, ఎప్పటికీ తామే అధికారంలో ఉండాలని జగన్ ప్రభుత్వం కోరుకొంటోంది తప్ప మన రాష్ట్రం ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోంది?అని ఆలోచిస్తున్నట్లు లేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు గడిచిపోయినా రాజధాని నిర్మించుకోలేకపోయామనే సిగ్గు, బాధ ఏమాత్రం కనిపించడం లేదు. కనీసం మూడు రాజధానులను ఏర్పాటు చేయలేకపోయింది.

భారత్‌, పాక్ దేశాలకు కొన్ని గంటల తేడాలో స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఒకేసారి ఏర్పడ్డాయి. పాక్‌తో పోలిస్తే భారత్‌ అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి చెందినట్లే, ఏపీతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతగానో అభివృద్ధి సాధించడం కళ్ళారా చూడగలుగుతున్నాము.

తెలంగాణలో సాధ్యమైనది ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కావడం లేదు? తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులలో కనీసం 10 శాతం ఏపీకి ఎందుకు రావడం లేదు?ఏపీలో సహజవనరులు, మేధోశక్తి లేవా?అంటే ‘అన్నీ ఉన్నాయి కానీ అల్లుడు నోట్లో శని’ అనే సామెత అక్షరాల ఆంధ్రప్రదేశ్‌కు వర్తిస్తుంది.

పాలకులకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, చిత్తశుద్ధి, దూరదృష్టి ఉంటే రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకొనేందుకు తెలంగాణ రాష్ట్రం మన కళ్ళ ముందే ఉంది. ఆ లక్షణాలు లేని పాలకులు పాలన సాగిస్తే రాష్ట్రం ఎటువంటి దుస్థితి, దయనీయ పరిస్థితులలో ఉంటుందో తెలుసుకొనేందుకు మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.

ప్రజలు వైసీపీకి ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకొని తెలంగాణలా ఏపీని కూడా అభివృద్ధి చేసి చూపించి ఉంటే ప్రజలు ఎన్ని ఛాన్సులైన ఇస్తారని గ్రహించలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చాలా శ్రమ, కృషి, పట్టుదల, తెలివితేటలు అవసరం. అంతకష్టపడటం కంటే ఓటర్లను గుర్తించి వారికి సంక్షేమ పధకాల ఎర వేసి మళ్ళీ రెండో ఛాన్స్ దక్కించుకోవడమే సులువని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. వాటి కోసం ఇష్టం వచ్చిన్నట్లు అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్ ఆగమ్యగోచరంగా మార్చేస్తున్నందుకు ప్రజలు పండగ చేసుకోవాలా?అంటే అవుననే చెపుతోంది జగన్ సర్కార్!