If Jagan loses will he stay in AP GVL Narasimha Rao “నాయకుడంటే మాట మీద నిలబడాలి. అతనిని చూసి కార్యకర్తలు కాలరేగరేసుకొని చెప్పుకొనేలా ఉండాలి. ఇదే నా రాష్ట్రం… ఇదే నా మమకారం… ఈ రాష్ట్ర ప్రజలే నా కుటుంబం…ఇక్కడే నా జీవితం” అంటూ కడప జిల్లాలో సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన పంచ్ డైలాగ్స్‌పై బిజెపి ఎంపీ జీవిఎల్ ఘాటుగా స్పందించారు.

మాట తప్పనన్న మనిషి ముఖ్యమంత్రి కాగానే అమరావతి విషయంలో మాట తప్పాడు. గెలిచినా ఓడినా ఇక్కడే నా జీవితం అంటూ పంచ్ డైలాగులు కొట్టిన సిఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికలలో ఓడిపోతే హైదరాబాద్‌ పారిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంటారనే నమ్మకం లేదు. ఉంటారంటే ప్రజలకి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. వైసీపీ, టిడిపి నేతలకి అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్‌ గుర్తుంటుంది లేకుంటే హైదరాబాదే వారి కేరాఫ్ అడ్రస్. సిఎం జగన్‌ ఓడిపోతే లోటస్ పాండ్‌కి వెళ్లిపోవడం ఖాయం.

ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రానికి కొత్తగా ఒక్క ఐ‌టి కంపెనీని తీసుకురాకపోగా ఉన్నవాటిని కూడా రాష్ట్రం నుంచి తరిమేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన యువత ఐ‌టి రంగంలో 10 నుంచి 15 శాతం వరకు ఉంటే, వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఐ‌టి రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ధ్యాసేలేదు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఐ‌టి రంగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వెనుకబడిపోవడం చాలా బాధాకరం. కేంద్ర ప్రభుత్వం అన్ని విదాల రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న వైసీపీ పాలనలో రాష్ట్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోయింది. కనీసం ఇప్పటికైనా మేల్కొని ఐ‌టి రంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.

సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా శ్రమించి హైదరాబాద్‌కి అనేక ఐ‌టి కంపెనీలను రప్పించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఫలించేలోగానే అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని పట్టించుకోకపోవడంతో కొన్ని ఏపీ గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయాయి. సిఎం జగన్‌ కోట్లు ఖర్చు పెట్టుకొని ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్ళివచ్చారు కానీ ఒక్క కంపెనీ కూడా ఏపీకి తీసుకురాలేకపోయారు.

ఐ‌టి కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి రావాలంటే కేవలం ప్రోత్సాహకాలు ఇస్తే సరిపోదు. ఒక ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అమలుచేస్తుందనే గట్టి నమ్మకం, రాజకీయ నిలకడతనం, బలమైన రాజధాని వంటివి కూడా చాలా అవసరం. కానీ వీటిలో ఏ ఒక్కటీ లేవు గనుకనే ఏపీకి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రావడానికి ఇష్టపడటం లేదని చెప్పవచ్చు. అయితే అవి రాలేదనే ఆలోచన, బెంగా రెండూ వైసీపీ ప్రభుత్వానికి లేవు. కనుక వాటి గురించి ఆలోచించనవసరం లేదు కూడా.