if-jagan-is-opposition-tdp-will-win-in-2019-says-ganta-srinivas-raoఅధికార పక్షం చేసే తప్పులను హైలైట్ చేసుకుంటూ ప్రజల్లో మెప్పు పొందడం ప్రతిపక్షం చేసే పని. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సీన్ రివర్స్. ప్రతిపక్షం చేసే తప్పులు హైలైట్స్ గా మారుతుండడంతో, ప్రజల్లో తమకు వ్యతిరేకత పెరగకుండా అధికార పక్షం చూసుకుంటోంది. ఏపీలో గత రెండేళ్ళ పాలనను గమనిస్తే… పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. దీనికి ఆర్ధిక కష్టాలు, కేంద్రం కరుణ చూపకపోవడం… ఇలా అనేక కారణాలున్నాయి. అయితే దీని నుండి లబ్ది పొందలేని ప్రతిపక్ష నేత జగన్, ఏపీ సర్కార్ కు మరింత మేలు జరిగే విధంగా ప్రవర్తిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పలు సందర్భాలలో ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

సరిగ్గా ఇలాంటి అభిప్రాయాన్నే దాదాపుగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రణాళిక బద్ధంగా చేసుకుని వచ్చినట్లయితే, ఈ రెండేళ్ళ ప్రభుత్వ పాలనను వినియోగించుకుని జగన్ ఒక స్థాయిలో ఉండేవారని, అయితే అతని అనుభవలేమి, ప్రవర్తనా విధానం ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ గా మారిందని, ఈయనే గనుక 2019 ప్రతిపక్ష నేతగా ఉంటే… విజయం అనేది ‘కేక్ వాక్’ అని అభిప్రాయపడ్డారు గంటా.

అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని, ‘నేనొక్కడినే’ పరిగెడితే కాదు, అందరూ కలిసి పని చేయాలని పరుగులు పెట్టిస్తున్నారని అన్న గంటా, ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిందని అన్నారు. హోదాను మించి ప్యాకేజ్ ఇస్తామన్నా హోదానే కావాలనే విధంగా ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిందని, అయితే దాని నుండి టిడిపి తేలికగానే బయట పడుతుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు ఈ మంత్రివర్యులు.