Dasara Jr Ntrఇంట్లో అత్తాకోడళ్లు గొడవపడితే పక్కింటోళ్లకు కాలక్షేపం దక్కిందని ఒక పాత నానుడి ఉంది. ఇప్పటి సోషల్ మీడియా జనాలను చూస్తే ఇదే గుర్తొస్తోంది. నాని దసరా వంద కోట్ల గ్రాస్ చేరుకొందని ఏడ్చే బ్యాచ్ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వార్ 2 ఉండబోతోందని ప్రకటన వచ్చాక కన్నీళ్లు పెట్టే యాంటీ ఫ్యాన్స్ టీమ్ మరొకటి. దేశముదురు రీ రిలీజ్ ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆన్ లైన్ బుకింగ్స్ స్క్రీన్ షాట్లు తీసి అల్లు అర్జున్ కి మార్కెట్ లేదని నిరూపించడానికి తహతహలాడుతున్న టీమ్ ఇంకొకటి.

కిరణ్ అబ్బవరం మీటర్ రిలీజ్ గురించి ఎక్కడ ట్వీట్ కనపడినా ట్రోలింగ్ చేద్దామని చూస్తున్న వాళ్ళు, కిసీకా భాయ్ కిసీకా జాన్ లో రామ్ చరణ్ క్యామియో గురించి నానార్ధాలు తీస్తున్న వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. నిజానికి ఇలా చేయడం వల్ల అవతలి వాళ్ళను గేలి చేసి ఏదో మానసిక ఆనందం పొందుతున్నామని సంతృప్తి పడుతున్నారు తప్పించి నిజానికిలా ఫ్యాన్స్ ఒకరిమీద మరొకరు బురద జల్లుకోవడం వల్ల వచ్చే నష్టం ఫేక్ ఐడిలు పెట్టుకునే వాళ్లకు ఉండకపోవచ్చు. కానీ దీనికి ఇంకో కోణం ఉంది.

ఈ ఆన్ లైన్ రచ్చను సీరియస్ గా గమనించే ఉత్తరాది మీడియా సంస్థలు, బాలీవుడ్ కేవలం సౌత్ డామినేషన్ వల్ల వెనుకబడుతోందని భావిస్తూ ఈర్ష్యతో రగిలిపోయే నార్త్ జనాలు బోలెడున్నారు. ఇక్కడ రచ్చని తెలుగులో చేసుకున్నా జస్ట్ ట్రాన్స్లేట్ ఆప్షన్ తో ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసుకునే సౌలభ్యం ఉండగా ఇదంతా అర్థం కాకుండా పోతుందా. ఇక్కడి కొందరు అభిమానుల కుంచిత మనస్తత్వం ఎంత కింది స్థాయిలో ఉందో సులభంగా తెలిసిపోతుంది. పైగా వీటిని హీరోలే ప్రోత్సహిస్తున్నారనే తప్పుడు అభిప్రాయమూ కలుగుతుంది.

ఇక్కడ ఆలోచించాల్సింది ఒకటే. తెలుగు సినిమా స్థాయి క్రమంగా పెరుగుతోంది. బాహుబలికి ముందు హిందీ డబ్బింగ్ చేస్తే కనీసం ఖర్చులైనా వెనక్కు వస్తాయో లేదోనని భయపడిన స్టేజి నుంచి కేవలం డిజిటల్ రైట్స్ తోనే వందల కోట్ల డబ్బుని డిమాండ్ చేయగల రేంజ్ కు చేరుకుంది. టాలీవుడ్ మూవీ అంటే కేవలం బయ్యర్లు రీమేక్ హక్కులు కొనుకున్న ప్రొడ్యూసర్లే కాదు సగటు ఢిల్లీ ముంబై జనాలు కూడా వీటిని థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది కించపరుచుకునే రచ్చ కాదు. జరుగుతున్న వాస్తవాన్ని అందుకున్న విజయాలను గర్వంగా చెప్పుకునే తత్వం. లేదు మాకేం వద్దు మాపని మాదేనంటే ఎవరేం చేయగలరు.