If Flop movies are Re-released will they become classicsఊపిరిలో ప్రకాష్ రాజ్ విచిత్రమైన పెయింటింగ్ ఒకటి చూపించి ఎంత అద్భుతంగా ఉందోనని పొగుడుతాడు. ఎక్కడ కాదని చెబితే కళాత్మక దృష్టి లేదనుకుంటారోనని భయపడిన కార్తీ ఔనని తలూపి దానివైపే తదేకంగా చూస్తాడు. అయినా అందులో అంత గొప్పదనం ఏముందో అర్థం కాదు. ఇప్పుడు రీ రిలీజుల హడావిడి చూస్తుంటే అచ్చంగా ఇదే సీన్ గుర్తుకు వస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ బాబా రీ రిలీజ్ అవుతోంది. అలా ఇలా కాదు. ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నారు. పనికిరావని పక్కన పడేసిన సీన్లను నెగటివ్ లు వెతికి మరీ బూజు దులిపి కొత్తగా డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఏఅర్ రెహమాన్ ని ఒప్పించి స్పెషల్ గా సౌండ్ పర్యవేక్షణ చేయిస్తున్నారు.

ఇంతా చేస్తున్న ఈ బాబా 2002లో మాములు డిజాస్టర్ కాదు. రెండో వారానికే డిస్ట్రిబ్యూటర్లు బెంబేలెత్తిపోయారు. నరసింహ లాంటి పవర్ ఫుల్ పాత్రలో చూసిన రజనిని ఇందులో కాసేపు హీరోయిజం కాసేపు వేదాంతాలు చెబుతూ మరికాసేపు పొలిటికల్ పంచులు వేసే క్యారెక్టర్ లో చూడలేకపోయారు. ఫలితంగా దీని వల్ల బయ్యర్లు కోల్పోయిన డబ్బుని సర్దడానికి నిర్మాతలకు చుక్కలు కనిపించాయి. కట్ చేస్తే ఇదో క్లాసిక్ అంటూ ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియాలో మాములుగా మోయడం లేదు. ఆరెంజ్ వల్లే నేను చచ్చిపోవాలనుకున్నానని స్టేట్ మెంట్ ఇచ్చిన నాగబాబు ఆ సూపర్ ఫ్లాప్ ని అతి త్వరలో రీరిలీజ్ కు హామీ ఇచ్చేశారు.

బండ్ల గణేష్ సైతం నేనేం తక్కువా అంటూ తీన్ మార్ ని సిద్ధం చేయిస్తున్నానని ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశాడు. ఫ్రీగా యూట్యూబ్ లో దొరికే ఇలాంటి వాటికి సైతం ఇంత బిల్డప్ ఇవ్వడం చూస్తే అప్పట్లో థియేటర్ అనుభవాలు గుర్తున్న మూవీ లవర్స్ నవ్వుకుంటున్నారు. ఇటీవలే బాద్షాని అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు. నిజమైన బ్లాక్ బస్టర్ వర్షంకే ఆర్టిసి క్రాస్ రోడ్స్ దాటి ఎక్కడా కనీసం ప్రింట్ ఖర్చులు కూడా తేలేదని ట్రేడ్ లో గొణుక్కున్నారు. పోకిరి అంటే ఓకే. ఇండస్ట్రీ రికార్డు కాబట్టి ఆ నోస్టాల్జిక్ మెమరీని నిజంగా ఎంజాయ్ చేశారు. జల్సా, చెన్నకేశవరెడ్డిలు పర్లేదు. వాటిలో ఉన్న కొన్ని హీరోయిక్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి థియేటర్లకు వచ్చేలా చేశాయి

ఇదేదో బాగుందని ఆడని సినిమాలను కూడా రీ రిలీజ్ ల పేరుతో తీసుకురావడం వల్ల ఈ ట్రెండ్ కున్న విలువ క్రమంగా తగ్గుతోందని అభిమానులు వాపోతున్నారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప చిత్రాలను ఇప్పటి జనరేషన్ కు తెరమీద చూపించడంలో తప్పు లేదు. ఈ నెల 9న మాయాబజార్ ని తెస్తున్నారు. ఇలాంటివి చాలా అవసరం. అంతే తప్ప ఒకప్పుడు జనం నో అన్నవి ఇప్పుడేదో కాలం మారిందని రుద్దడానికి ప్రయత్నిస్తే ఏదోనాడు తిరస్కారం పెరిగిపోయి త్వరగా ముగింపు పలకాల్సి వస్తుంది. అసలు కొత్త రిలీజులకే జనం రాక పరిశ్రమ వర్గాలు బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే ఇప్పుడున్న అధిక టికెట్ రేట్లకే పాత ఫ్లాపులను చూపిస్తాం ట్విట్టర్ లో మోసేసి థియేటర్ కు రమ్మంటే ఎలా.