Chiranjeevi Balakrishna combo Movie will it happenఎక్కడైనా బావ కానీ వంగతోట కాడ కాదన్నది ఒక సామెత. దీనికి రకరకాల వర్షన్లు ఉన్నాయి కానీ ఇండస్ట్రీకి ఇది సరిగ్గా సరిపోతుంది. పైకి ఎంతో స్నేహ పూర్వకంగా ఉండే స్టార్ హీరోలు మల్టీ స్టారర్స్ విషయంలో మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తారో అందరికీ తెలిసిందే. కొందరికి ఈగోల సమస్య. మరికొందరికి ఇమేజ్ ల గోల. ఇంకొందరికి అభిమానులు తమ గురించి ఏమనుకుంటారోననే టెన్షన్. వెరసి బాలీవుడ్ తరహాలో ఇక్కడ ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు కలిసి నటించడం చాలా అరుదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి 14 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకోవడం బహుశా ఆ స్టేచర్ ఉన్న తారల విషయంలో ఇండియా మొత్తంలో ఆ కలయిక ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పొచ్చు.

తర్వాతి తరం వచ్చాక ఇవి పూర్తిగా ఆగిపోయాయి. చిరంజీవి బాలయ్యలు మంచి స్నేహితులు. అందులో అనుమానం లేదు. కానీ కలిసి నటించే విషయంలో మాత్రం నలభై సంవత్సరాల సుదీర్ఘ నట ప్రయాణంలో ఏనాడూ ఆలోచించలేదు. తాజాగా అన్ స్టాపబుల్ షోలో అల్లు అరవింద్ ఈ కోరికను వ్యక్తం చేశారు. మెగాస్టార్ యువరత్న కలిపే కాంబో మూవీ తీయాలనే కాంక్షను వెల్లడించారు. దానికి బాలయ్య స్పందిస్తూ అప్పుడది ప్యాన్ వరల్డ్ మూవీ అవుతుందని చెప్పారు. వినడానికి బాగానే ఉంది. ఆచరణలో సాధ్యమవుతుందో లేదో డౌటే. సంక్రాంతికే పంతాలకు పోయి క్లాష్ కు సిద్ధ పడిన ఈ సీనియర్ స్టార్లు ఫ్యాన్స్ అంచనాలను పట్టించుకోకుండా ఉంటారా.

ఇక్కడ ఆర్ఆర్ఆర్ గురించి కొద్దిగా ప్రస్తావించుకోవాలి. రాజమౌళి మొదట ఈ కాంబో అనౌన్స్ చేసినప్పుడు అందరూ షాక్ తిన్నారు. ఎప్పటికీ జరగదనుకున్న కొణిదెల నందమూరి హీరోలు కలిసి నటించడం గురించి ఓ రేంజ్ లో చర్చ జరిగింది. తీరా విడుదలయ్యాక ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా దుమ్మెత్తి పోసుకున్నారో ఈ రోజుకీ జరుగుతూనే ఉంది. మీ వాడిని సైడ్ హీరో చేశారని ఒక వర్గం, మావాడే మెయిన్ హీరో అని ఇంకో బ్యాచ్ రకరకాలుగా ఘోరంగా తిట్టుకున్నారు. ఒకదశలో ఈ అర్థం పర్థం లేని పోలికలు పీక్స్ కు చేరుకొని చరణ్ తారక్ ల దాకా వెళ్లి వాళ్ళు కొంచెం డిస్ట్రబ్ అయినట్టుగా కూడా సినీ జనాలు మాట్లాడుకున్నారు

వీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే నిజంగా చిరు బాలయ్య కలిసి నటిస్తే ఆ కలయికని బ్యాలన్స్ చేయడం కత్తి మీద సామే. ఎప్పుడో పాతికేళ్ల క్రితమైతే ఏమో కానీ ఇప్పుడు ఇద్దరి వయసు అరవై దాటేసింది. తెరమీద ఎనర్జీ చూపించినా ఒక్కసారి కాంబో ఫిక్స్ అయ్యాక తమని సరిగా హ్యాండిల్ చేస్తున్నారానే అనుమానం చాలా ఒత్తిడిని తెస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడం సులభం కాదు. అన్నయ్యలో సపోర్టింగ్ రోల్ చేసిన రవితేజకు స్టార్ డం వచ్చాక తిరిగి ఆయనకు తమ్ముడిగా నటించడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది. అలాంటిది పైన చెప్పిందంతా జరిగేపనేనా. మగధీరలో బ్రహ్మానందం ఓ సీన్లో తలుచుకున్నట్టు అంటే అన్నాడు కానీ ఊహించుకుంటే ఎంత బాగుందో తరహాలో అల్లు అరవింద్ మాటలు అక్కడికే ఆగేలా ఉన్నాయి.