Idi Naa Love Story Teaser Talkహీరోగా చేసిన తొలి సినిమా ‘నువ్వే కావాలి’ ఏకంగా ఒక ఏడాది పాటు ఆడడంతో ఎక్కడో ఉంటాడని భావించిన తరుణ్, కొన్నాళ్ళకే కనుమరుగైన విషయం తెలిసిందే. హీరోయిన్లతో ప్రేమాయణం నడిపే క్రమంలో కెరీర్ కు ప్రాధాన్యత ఇవ్వలేదని, అందుకే తరుణ్ సిల్వర్ స్క్రీన్ కు దూరమయ్యాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమయ్యే విషయం. అయితే చాలాకాలం తర్వాత ఓ కన్నడ రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు తరుణ్. ఈ సినిమా టీజర్ ను ‘కింగ్’ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేసారు.

“ఇది నా లవ్ స్టోరీ” పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్ కు జతగా ఓవియా హీరోయిన్ గా నటిస్తోంది. ‘నా ప్రేమ ఒక డ్రీంలా మిగిలిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు’ అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో శ్రీనాధ్ విజయ్ అందించిన సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. నిజానికి ఈ టీజర్ ను ప్రేక్షకులకు చేరువ చేయడంలో శ్రీనాధ్ సంగీతం కీలక పాత్ర పోషించింది. ‘డబ్బుకు లక్ష్మి, విద్యకు సరస్వతి… కానీ ప్రేమకు ఎవ్వరూ లేరు…’ అంటూ చెప్పిన డైలాగ్స్ కూడా బాగున్నాయి.

చాలాకాలం తర్వాత కనపడిన తరుణ్ కూడా ఫ్రెష్ లుక్ తో ఆకట్టుకునే విధంగానే ఉన్నాడు. అయితే టైటిల్ కు ముందు ‘తరుణ్స్… ఇది నా లవ్ స్టోరీ’ అని పెట్టడంతో, ఇది రీల్ లవ్ స్టోరీనా, లేక తరుణ్ రియల్ లవ్ స్టోరీనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ టీజర్ లో తరుణ్ చెప్పిన ‘ప్రేమించిన అమ్మాయిని మరిచిపోవడం ఎంత కష్టమో నాకు తెలుసు’ అనే డైలాగ్స్ కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో తరుణ్ నడిపిన ప్రేమాయణం తెలియనిది కాదు. దీంతో హీరోకు తగిన విధమైన టైటిలే పెట్టారంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు.