ICC Champions Trophy England Vs New Zealandఐసీసీ నిర్వహించే టోర్నీలలో పాకిస్తాన్ ను ఇండియా ఓడించడం ఎంత పరిపాటిగా జరిగే విషయమో, క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ఆయా టోర్నీలలో కప్ గెలవకపోవడం కూడా అంతే పరిపాటిగా జరిగే విషయం. ఎక్కువ శాతం ఫైనల్స్, సెమీ ఫైనల్స్ కు ముందే వెనుదిరగడం ఇంగ్లాండ్ జట్టుకు అతి సహజం. అయితే ఈ సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం అందుకు విరుద్ధం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ ను గానీ, ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోని ఇంగ్లాండ్ జట్టు ఈ సారి మాత్రం మాంచి పట్టుదలతో ఉందన్న విషయం స్పష్టమవుతోంది.

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో 2017 సెమీ ఫైనల్స్ కు అడుగు పెట్టిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 87 పరుగులతో జయకేతనం ఎగురవేసి… గ్రూప్ ఎ విభాగం నుండి 4 పాయింట్లతో సెమీ ఫైనల్స్ లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసి 310 పరుగుల భారీ స్కోర్ ను పోస్ట్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, కివీస్ ను 223 పరుగులకే ఆలౌట్ చేసి, సెమీ ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. మరో స్థానం కోసం గ్రూప్ ఎ విభాగం నుండి ఆసీస్, కివీస్, బంగ్లాదేశ్ జట్లు పోటీపడుతున్నాయి.

ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్ లు వర్షార్పణం కావడంతో, కివీస్, బంగ్లా జట్లకు కూడా సెమీ ఫైనల్స్ కు చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 2013లో ఇంగ్లాండ్ వేదికగానే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఇండియా చేతిలో పరాభవం చవిచూసిన ఇంగ్లాండ్ జట్టు, ఈ సారి మాత్రం కప్ ఎగరేసుకుపోవడానికి కసరత్తులు చేస్తోంది. ఈ సారి ఫైనల్స్ లో కాకుండా, సెమీ ఫైనల్స్ లోనే ఈ రెండు జట్లు తలపడే అవకాశం కనపడుతోంది. గ్రూపు బి నుండి అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడడంతో సెమీస్ స్థానాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.