icc champions trophy 2017 pakistan indiaపాకిస్తాన్ జట్టు అరవీర భయంకరంగా ఆడినా… సత్తువ లేకుండా ఓటమి పాలైనా… ఆ జట్టును ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టడం సహజం. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఫైనల్ కు చేరుకున్న పాకిస్తాన్ జట్టుపై మళ్ళీ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలు చేసింది మరెవరో కాదు… సాక్షాత్తు ఒకప్పుడు పాకిస్తాన్ టీంకు సారధ్యం వహించిన అమీర్ సొహైల్.

ఓపెనింగ్స్ బ్యాట్స్ మెన్ గా సయీద్ అన్వర్ తో పాటు బరిలోకి దిగే అమీర్ సొహైల్, పదేళ్ల పాటు పాకిస్తాన్ తరపున జట్టుకు సేవలు అందించాడు. అయితే తాజాగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా… ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ అన్ని మ్యాచ్ లను కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ ఫిక్స్ చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో బయటి శక్తులు కూడా పని చేశాయని, అక్రమ మార్గంలో పాక్ ఫైనల్ కు చేరిందని చెప్పిన విషయాలు క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి.

సహజంగా ఇతర జట్లపై ఆరోపణలు చేయడం సహజం గానీ, ఒక్క పాకిస్తాన్ జట్టులోనే ఆ దేశంపై ఆ దేశ క్రీడాకారులే ఆరోపణలు, విమర్శలు చేసుకుంటుంటారు. ఓ పక్కన పాకిస్తాన్ జట్టు ఇండియాతో ఫైనల్ కు సిద్ధమవుతున్న తరుణంలో… పాక్ జట్టు మనోనిబ్బరాన్ని దెబ్బతీసే విధంగా అమీర్ వ్యాఖ్యలు ఉండడం విశేషం. పాక్ పటిష్టమైన బౌలింగ్ వలన గెలిచిందని భావిస్తున్న క్రీడా విశ్లేషకులంతా, అమీర్ వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉందనేది తేల్చాలని అభిప్రాయ పడుతున్నారు.

అమీర్ సొహైల్ ఆరోపణలు నిజమైతే… ఇప్పటికే ఇండియా – పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కూడా ఫిక్స్ అయ్యి ఉండాలి కదా! మరి ఫైనల్ లో ఎవరు గెలిచేది కూడా సొహైల్ కు ముందే తెలిసి ఉండాలి కదా! మరి ఎందుకు వెల్లడించలేదు. ఆరోపణలు చేయడానికి మీడియా మైక్ ఉంటే సరిపోతుంది, కానీ అవి నిరూపించాలంటే బలమైన సాక్ష్యాధారాలు ఉండాలి, మరి వాటి విషయం మాత్రం అమీర్ సొహైల్ ప్రస్తావించకపోవడం విశేషం.