గత పది వారం రోజులుగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది గానీ, క్రీడాభిమనులకు కావాల్సిన కిక్ ను మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వలేకపోయింది. టోర్నీకే హైలైట్ గా నిలుస్తుందని భావించిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ‘వన్ సైడ్’ కావడంతో క్రికెట్ ప్రేమికులకు పెద్దగా రుచించలేదు. అయితే అలాంటి అనుభూతిని బంగ్లాదేశ్ జట్టు ఇచ్చింది. పసికూనలు కొట్టిన దెబ్బతో రెండు పెద్ద జట్లు విలవిలలాడుతున్నాయి. బంగ్లా చేతిలో ఓడిన కివీస్ ఇంటి ముఖం పట్టగా, ఇంగ్లాండ్ జట్టుతో ఖచ్చితంగా ఆసీస్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇది కూడా వర్షార్పణం అయితే ఆసీస్ కూడా ఇంటి ముఖం పట్టాల్సిందే.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది. ఒకానొక దశలో మూడొందలుకు పైగా స్కోర్ చేరుకుంటుందని భావించినప్పటికీ, బంగ్లా బౌలర్ల ప్రతిభతో చివరి 20 ఓవర్లలో కేవలం 110 పరుగులను మాత్రమే నమోదు చేయగలిగింది. ఇక లక్ష్య చేధనలో 33 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లా జట్టును షకిబ్ అల్ హసన్ – మహ్మదుల్లాలు ఆదుకున్నారు. ఆదుకోవడం అంటే అలా ఇలా కాదు… ఏకంగా బంగ్లా జట్టును విజయతీరాలకు చేర్చేలా… న్యూజిలాండ్ ప్లేయర్లకు గ్రౌండ్ లో చుక్కలు కనిపించేలా ఆడుకున్నారు.

అయిదవ వికెట్ కు ఏకంగా 224 పరుగుల భాగస్వామ్యం అందించడంతో బంగ్లా విజయం ఖాయమైంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షకిబ్ అల్ హసన్ 115 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 114 పరుగులు చేయగా, మహ్మదుల్లా 107 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వీరిద్దరూ కొట్టిన షాట్లకు మతిపోవడం కివీస్ ఆటగాళ్ళ వంతయ్యింది. ఈ విజయంతో ఆడిన మూడు మ్యాచ్ లలో 3 పాయింట్లతో గ్రూప్ ఎ రెండవ స్థానంలో నిలిచింది బంగ్లా. దీంతో నేడు ఇంగ్లాండ్ జరగబోయే మ్యాచ్ ఆస్ట్రేలియాకు ‘డూ ఆర్ డై’లా మారింది.