i am not kapu but protector pawan kalyan about kapu reservation issueవర్తమాన రాజకీయ సామజిక అంశాలను తన సినిమాలలో ఏదొక సందర్భంలో పలికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో చెలరేగిన కుల రాజకీయాలపై సెటైరికల్ డైలాగ్స్ వేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణాలో రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో రాజుకున్న కుల వివాదం, అలాగే ఏపీలో కాపులను బీసీల్లోకి చేర్చాలంటూ చెలరేగిన విధ్వంసం తెలిసిందే.

స్వతహాగా ‘కాపు’ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్, కాపుల ఉద్యమానికి మద్ధతు ఇవ్వలేదన్న ఆవేదన, ఆగ్రహం సదరు సామాజిక వర్గానికి చెందిన కొంతమందిలో ఉంది. అయితే తనకు కులంతో సంబంధం లేదని, కుల రాజకీయాల్లోకి తనను లాగవద్దని పవన్ ‘జనసేన’ ఏర్పాటైన తొలిరోజే ప్రస్తావించారు. తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా ఇదే రకమైన భావాలను వ్యక్తపరిచారు.

అయితే పరోక్షంగా అదే అర్ధాలు వచ్చే విధంగా తన లేటెస్ట్ సెన్సేషన్ “సర్ధార్ గబ్బర్ సింగ్” చిత్రంలో కూడా పలు డైలాగ్స్ పెట్టినట్లుగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఒక సందర్భంలో “నేను కాపు వాడ్ని కాదు, కాపు కాసే వాడ్ని” అంటూ పవన్ చెప్తారని, ఇవి వర్తమాన రాజకీయాలకు ప్రతిబింబించే విధంగా ఉంటాయని, అలాగే సినిమాలో పవన్ ధరించిన పోలీస్ పాత్రకు కూడా ఈ డైలాగ్స్ సరిపోతాయని, “కాపు కాసే వాడు” అంటే రక్షకభటుడేనని…. ఈ డైలాగ్స్ కు ‘సర్ధార్’ నోటి వెంట వచ్చేవే అని అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేసే ఇలాంటి పంచ్, సైటైరికల్ డైలాగ్స్ ను వెండితెరపై వీక్షించాలంటే ఏప్రిల్ 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.!