ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ మీడియా గుప్పు మంది. మీడియాలో వచ్చిన వార్తలకు బలమైన కారణమే ఉంది. గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలతో ఆయన ఇమడలేకపోతున్నారు. టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలలోకి వెళ్ళలేని పరిస్థితి కనుక జనసేన వైపు చూస్తున్న సమయంలో ఓ కేసు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేయగా ఆయనకు సహకరించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత చేనేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు మొదలైన ఛాలెంజ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ బాలినేని పేరు నామినేట్ చేయగా, ఆయన వెంటనే ఆ ఛాలెంజ్‌ని అంగీకరించి చేనేత చొక్కా ధరించి పవన్ కళ్యాణ్‌కు ఆ ఫోటో పెట్టారు. కనుక బాలినేని-పవన్ కళ్యాణ్ మద్య దోస్తీ బలపడిందని స్పష్టమైంది. పార్టీ నేతలతో కూడా బాలినేని సమస్యలు ఎదుర్కొంటున్నారు కనుక జనసేనలో చేరబోతున్నారంటూ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి.
వాటిపై స్పందిస్తూ, “నేను పార్టీ మారుతున్నానంటూ మీడియాలో కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని నేను ఖండిస్తున్నాను. నాకు వైఎస్సార్ రాజకీయ భిక్ష పెట్టారు. సిఎం జగన్మోహన్ రెడ్డి నన్ను ఎంతో ఆదరించి మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించారు. పదవులు, అధికారం శాశ్వితం కావు. వాటి కోసం నేను ఎప్పుడూ తాపత్రయపడలేదు. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా నేను ఎప్పటికీ వైసీపీలోనే ఉంటాను. ఊసరవెల్లిలా రంగులు మార్చే రాజకీయ నాయకుడిని కాను నేను.
చేనేతను ప్రోత్సహించాలనే సదుద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలు ధరించాలని సవాల్ చేస్తే ఆయన సదుద్దేశ్యాన్ని అర్దం చేసుకొని చేనేత చొక్కా ధరించాను. కానీ దానర్దం నేను జనసేనలో చేరుతానని కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను,” అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
నిప్పు లేకుండా పొగ రాదన్నట్లు బాలినేనిపై ఊరికే మీడియాలో ఊహాగానాలు వినిపించాయని అనుకోలేము. ఆయన పార్టీ మారుతారా లేదా అనే దానిపై క్రమంగా స్పష్టత రావచ్చు.