గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధ్వర్యంలో జరిగిన యువశక్తి బహిరంగసభలో పాల్గొన్న వారి అధినేత పవన్ కళ్యాణ్‌తో సహా ఆ సభలో ప్రసంగించిన పలువురు యువతీయువకులు వివిద అంశాలపై తమ అభిప్రాయాలను, ఆలోచనలని అందరితో పంచుకొన్నారు. ఈ సభలో బుల్లితెర నటుడు హైపర్ ఆది కూడా పాల్గొన్నారు. అతని ప్రసంగానికి పవన్ కళ్యాణ్‌తో సహా సభకి వచ్చిన సుమారు లక్షమంది చప్పట్లతో హర్షధ్వానాలు తెలియజేశారు.
ఇంతకీ హైపర్ ఆది ఏమన్నారంటే, “రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకొంటున్న కౌలురైతుల కుటుంబాలని ఆదుకొనేందుకు సినిమాలు చేస్తున్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్. ఆయన అనేక సినిమాలు చేస్తూ వందల కోట్లు సంపాదిస్తున్నప్పటికీ, ఇక్కడ ఈ వేదిక మీద కూర్చొన్నవారందరికంటే తక్కువ ఆస్తులు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సంపాదించిన డబ్బంతా ప్రజలకే పంచిపెడుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్. డబ్బు పంచడమే తప్ప పెంచుకోవడంపై ఏమాత్రం ఆశాలేని ఇటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ప్రజలకి చేరుతుంది. ఇటువంటి పవన్ కళ్యాణ్‌ని పట్టుకొని వైసీపీ మంత్రులు ప్రెస్‌మీట్‌లు పెట్టి బూతులు తిడుతుంటారు. నిజానికి వారికి ఈ శాఖ, ఆ శాఖ అని ఇవ్వడం కంటే అందరికీ కలిపి ‘పవన్ కళ్యాణ్‌ని తిట్టే ఓ శాఖ’ని ఏర్పాటు చేసి ఇస్తే వారికీ తమతమ శాఖల గురించి మాట్లాడే ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో ఏమంత్రికీ తమ శాఖల గురించి పట్టుమని 10 నిమిషాలు మాట్లాడలేరు. ఒకవేళ మాట్లాడే ప్రయత్నం చేస్తే పదో సెకనులోనే దొరికిపోతారు. తమ శాఖల గురించి వారి అవగాహన రాహిత్యం బయటపడుతుంది,” అని హైపర్ ఆది అన్నారు.
ఏపీ మంత్రులపై తరచూ వినబడే ప్రధాన ఆరోపణ ఇదే. మంత్రులలో ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరూ ఎప్పుడు మీడియా ముందుకి వచ్చి మాట్లాడినా తమ శాఖల గురించి, వాటితో రాష్ట్రంలో జరుగుతున్న పనుల గురించి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను దూషించడానికి, వారి పొత్తుల గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. అందుకే హైపర్ ఆది వంటివారు కూడా వారిని వేలెత్తి చూపుతున్నారు.