Hyper Aadiప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు పేరు ఏదైనా కావొచ్చు స్టేజి మీద జరిగే తతంగం ఒకటే. సదరు సినిమాలో నటించిన హీరో తాలూకు హిట్టు పాటలకు బయటి బృందాలతో డాన్సులు చేయించడం, అందులో పాటలు పాడిన సింగర్స్ ని తీసుకొచ్చి లైవ్ పెర్ఫార్మన్స్ ఇప్పించడం, గెస్టులు వచ్చేంత వరకు చిన్న ఆరిస్టులతో మాట్లాడించడం ఇది ప్రతిదానికి కామన్. పెద్దగా మార్పు ఉండదు. అతిథులు, కథానాయకుడు, హీరోయిన్లు వచ్చాక ఈ ఫార్మాట్ ని మార్చేసి బాగా స్పీచులిచ్చేవాళ్ళను ముందుకు తీసుకురావడం జరుగుతుంది.

గతంలో బండ్ల గణేష్ వైరల్ ప్రసంగాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచేవాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని పొగిడేందుకు ఆయనతో ఎవరూ పోటీ పడలేరన్నది వాస్తవం. ఒకదశలో ఇది తట్టుకోలేకే త్రివిక్రమ్ తనకు సంబంధించిన వేడుకలకు గణేష్ ని పిలవడం మానేశారన్నది ఓపెన్ సీక్రెట్. దానికి ఇన్ డైరెక్ట్ పంచులు బండ్లన్న ట్విట్టర్ లో పేలుస్తునే ఉంటారు. ఈయన ప్రభావం ఎంతగా ఉంటుందంటే బాలకృష్ణ ఆన్ స్టాపబుల్ లో ఈశ్వర పవనేశ్వరా అంటూ గణేష్ సృష్టించిన స్లోగన్ ని వాడుకునేంత. ఇప్పుడీ స్థానాన్ని హైపర్ ఆది తీసుకున్నట్టు కనిపిస్తోంది.

జబర్దస్త్ ఆర్టిస్టుగా రైటర్ గా మంచి పాపులారిటీ ఉన్న హైపర్ ఆది ఈ మధ్య జనసేన తరఫున చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇటీవలే ఒక పొలిటికల్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ముందే ఓ రేంజ్ లో మాట్లాడేసి ఫ్యాన్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. స్వతహాగా పంచులు ప్రాసలు వాడటం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆ స్పార్క్ మాటల్లో చాలా పనికొస్తోంది. ఏకంగా ఏపీ మిస్టర్ రోజా ఆది కామెంట్లకు స్పందించే దాకా పరిస్థితి వెళ్ళింది. తాజాగా సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ని హైపర్ ఆది మాములుగా మోయలేదు.

నిజానికి ఈ సినిమాకు త్రివిక్రమ్ కు రచన పరంగా ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా మాటల మాంత్రికుడి కలం గురించి వర్ణిస్తూ అక్షరాలకు మనిషి రూపం వస్తే ముందు త్రివిక్రమ్ కే థాంక్స్ చెబుతాయని మొదలుపెట్టి ఏకధాటిగా ధనుష్ సినిమాకు దర్శకుడు ఎవరన్నంత రేంజ్ లో మోసేశాడు. ఇది అభిమానమే కావొచ్చు కానీ నిర్వాహకులు చాలా ప్లాన్డ్ గా తనను ప్రైమ్ టైంలో మాట్లాడించిన తీరు చూస్తే ఉద్దేశమేంటో అర్థం చేసుకోవచ్చు.కేవలం కామెడీ షోలకే కాదు సినిమాలు రాజకీయాల్లో తన ఉనికిని ఇంకాస్త బలోపేతం చేసుకునే ప్లాన్ లో ఉన్న హైపర్ ఆదిని చూస్తుంటే బండ్లన్నని మించిపోయేలా ఉన్నాడు.