hyper aadi Meda Meedha Abbayi promotionsబుల్లితెర త్రివిక్రమ్ గా ‘జబర్దస్త్’ను ఏలుతోన్న ‘హైపర్ ఆది’ తాజాగా “మేడ మీద అబ్బాయి” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన ఆదికి గుర్తింపు బాగానే లభించింది గానీ, ఆ సినిమానే ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ, వ్యక్తిగత అనుభూతులను పంచుకున్నాడు ఆది. ముందుగా ఇటీవల కాలంలో తన పెళ్ళయ్యిందని జరిగిన ప్రచారం గురించి స్పందిస్తూ…

ప్రస్తుతం తన వయసు ఇరవై ఐదేళ్లని, ఇరవై ఏడు రాగానే పెళ్లి చేసుకుంటానని, ఇంట్లో వాళ్లు చూసిన సంబంధమే చేసుకుంటానని కూడా స్పష్టంగా చెప్పారు. నటుడికి ఈ ఫీల్డ్ లో అవకాశాలు రాకపోవడం వంటి అంశాలు ఉంటాయి. కానీ, నేను మాత్రం ‘రైటింగ్’ నే నమ్ముకున్నాను. అది ఉన్నంత కాలం ఈ ఫీల్డ్ లో ఇబ్బంది లేదు. ఎందుకంటే వంద కోట్లతో సినిమా తీయాలన్నా పేపర్ మీద స్క్రిప్ట్ ఉండాలి. అది లేకపోతే సినిమా తీయలేరు. నేను కేవలం కామెడీ స్క్రిప్ట్ లే రాస్తున్నాను. వేరే ఎమోషన్స్ కు సంబంధించిన స్క్రిప్ట్స్ ను అంతగా రాయలేనేమో! అన్న ఆది, ఇటీవల కాలంలో తనకు బాగా నచ్చిన సినిమాగా “అర్జున్ రెడ్డి” సినిమాను పేర్కొన్నారు.

ఈ సినిమాను రెండు సార్లు చూశానని, సూపర్ గా ఉందని, ప్రస్తుతం ప్రతి సినిమాకు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని, పబ్లిసిటీ స్టంట్ చేసే విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నెంబర్ వన్. ఎందుకంటే, ఆయన సినిమా టైటిల్ నుంచే పబ్లిసిటీ స్టంట్ కనపడుతూ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించాలనేది తన చిరకాల కోరిక అని, చిరంజీవి గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటించిన విజేత సినిమా అంటే చాలా ఇష్టం… ముప్పై, నలభై సార్లు చూసుంటాను. సైరా నరసింహారెడ్డి వంటి చిత్రంలో ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటే కనుక నా ఆనందానికి అవధులు వుండవు!’ అన్నాడు.

‘ఏదైనా సినిమాలో నాకో అవకాశం ఇవ్వండి అని అడగడం వేరు, వాళ్లంతట వాళ్లు పిలిచి నటించమంటే వచ్చే సంతృప్తి వేరు’ అన్న హైపర్, కమెడియన్లలో బ్రహ్మానందం అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ‘జబర్దస్త్’ స్క్రిప్ట్ కు తాను మొదట తీసుకున్నది మూడు వేల రూపాయలని, ఆ తర్వాత క్రమక్రమంగా ఎదిగానని చెప్పాడు. ‘మూడు వేల రూపాయలతో మొదలైన మీ పారితోషికం, ఆ తర్వాత మూడు పక్కన ఎన్ని ‘సున్నా’ల వరకు చేరింది?’ అని ప్రశ్నించగా, అవి చెప్పే ‘సున్నా’లు కాదని చమత్కరించాడు హైపర్ ఆది.