Hyderbad traffic to follow delhi Odd-Even Ruleహైదరాబాద్ లోని ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేసిన సరి – బేసి’ విధానం అమలు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఐటీ కారిడార్‌ పరిధిలో కొత్తగా వస్తున్న నిర్మాణాలు, పెట్టుబడులు, కంపెనీలు, వాహన రద్దీ, కాలుష్యం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో తలెత్తే ముప్పును నియంత్రించేందుకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

ఈ అంశంపై దాదాపు 100 మంది ఐటీ కంపెనీల ప్రతినిధులతో బుధవారం అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఐటీ, జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, టీఎస్‌ఐఐసీ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్‌పూలింగ్‌ని ప్రోత్సహించి, ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచితే పరిస్థితి మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. రహేజా పార్కు – రాయదుర్గం, బయోడైవర్సిటీ పార్కు – ఐకియా మార్గంలో కార్ల రద్దీ ఎక్కువగా ఉంది. రాయదుర్గం పరిధిలో పలు సంస్థలు కొత్త నిర్మాణాలు ప్రారంభించాయి. దీనివల్ల కూడా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఈ మార్గాల్లో రద్దీ తగ్గించేందుకు కార్‌పూలింగ్‌ విధానాన్ని ప్రోత్సహించాలని వారు అభిప్రాయపడ్డారు. మాదాపూర్‌, హైటెక్‌ సిటీ మార్గంలో ఆర్టీసీ సేవల్ని మరింత విస్తృతం చేయాలి. అలాగే ప్రైవేటు పార్కింగ్‌ స్థలాల్లో ఫీజును పెంచాలి. దిల్లీలో పార్కింగ్‌ లాట్‌ ఫీజు రూ.5 వేలుగా ఉంది. ఇక్కడా ఈ విధానం పెడితే కొంత వరకైనా కార్ల రద్దీ తగ్గించవచ్చు అని కూడా వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఐటీ కారిడార్ కు మెట్రో అందుబాటులోకి వచ్చిన కారణంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అంతా ఒక అంగీకారానికి వచ్చారు.