Hyderabad to Lockdown Once Againగత కొద్ది రోజులుగా తెలంగాణలో మళ్ళీ లాక్ డౌన్ పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణాలో ఉన్న మొత్తం కేసులలో 75% వరకూ హైదరాబాద్ చుట్టుపక్కల నుండి వస్తున్నవే. దీనితో కనీసం జీహెచ్ఎంసీ ఏరియా వరకునైనా లాక్ డౌన్ పెడతారని గట్టిగా ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ పెట్టే ఉద్దేశం లేదని, దీనిపై ప్రభుత్వంలో ఎటువంటి చర్చ జరగడం లేదని తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఐసీఎంఆర్‌ ప్రతినిధులు రాష్ట్రంలో టెస్టులు చేస్తే… నామమాత్రంగానే పాజిటివ్స్ వచ్చాయి అని తెలంగాణ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

ప్రజల్లో నమ్మకం కలిగించడానికే టెస్టుల సంఖ్య పెంచామని చెప్పారు. “రాష్ట్రంలో 650 మంది హోమ్ ట్రీట్మెంట్‌లో ఉన్నారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా చికిత్స ఇస్తుంది. డబ్బులు కట్టి చికిత్స చేసుకునే ఉద్దేశం ఉంటే ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లొచ్చు,” అని ఆయన చెప్పారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర ₹ 2,200గా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్క రోజుకు వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే ₹ 7,500.. వెంటిలేటర్‌పై ఉంచితే ₹ 9వేలు ఛార్జీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయరని, లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని మార్గదర్శకాలు ఇస్తున్నామని ఆరోగ్య మంత్రి ఈటల చెప్పారు.