ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యే టీంలలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా ఉంటుందా? ప్రస్తుతానికి అయితే విజయవంతంగా సగం పని పూర్తి చేసుకుంది. ఆడిన 6 మ్యాచ్ లలో నాలుగు విజయాలను సొంతం చేసుకుని 8 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. చేతిలో ఇంకా 8 మ్యాచ్ లు మిగిలి ఉండగా, అందులో కనీసం 4 మ్యాచ్ లలో విజయం సాధిస్తే… హైదరాబాద్ జట్టు టాప్ 4లో ఒకటిగా నిలబడడం ఖాయం.
ఈ బరిలో ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ రెండూ కూడా ఆడిన 5 మ్యాచ్ లలో నాలుగింటిలో విజయం సాధించి, 8 పాయింట్లతో 1, 3వ స్థానాలలో నిలిచాయి. ఈ రెండు జట్లకు చేతిలో ఇంకా 9 మ్యాచ్ లు ఉండగా, కనీసం 4 మ్యాచ్ లలో విజయం సాధించాల్సి ఉంది. ప్రస్తుతం కనపరుస్తున్న ఫాంను చూస్తే… కోల్ కతా, ముంబై, హైదరాబాద్ టాప్ 4లో 3 జట్లుగా చెప్పవచ్చు.
మరి నాలుగవ స్థానంలో నిలిచే జట్టు ఏది? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జట్టు ఎంతో పటిష్టంగా ఉన్నప్పటికీ, 6 మ్యాచ్ లలో రెండు విజయాలను మాత్రమే అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పైనే క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అలాగే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ, పూణే జట్లు 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలతో 4 పాయింట్లు సొంతం చేసుకున్నాయి.