Hyderabad snake gang convictedహైదరాబాద్ లో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. కేసులో నిందితులుగా నిర్ధారణ అయిన ఎనిమిది మందిలో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వగా, ఏ-8గా ఉన్న నిందితుడికి 20 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్టు తెలిపారు. వీరంతా తమ చేష్టలతో సమాజంలో ఉండే అర్హతను కోల్పోయారని న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. వీరి నేరాలు తీవ్రమైనవని, అభియోగాలు తనకు దిగ్బ్రాంతిని కలిగించాయని, లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు కానప్పటికీ, స్వల్ప శిక్షకు వీరు అనర్హులని అన్నారు.

హైదరాబాద్ శివార్లలో కనిపించే జంటలకు పాములు చూపించి అత్యాచారాలు, దోపిడీలు చేసినట్టుగా వీరిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి అత్యాచారాలను నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లభించకపోగా, దోపిడీ, భయభ్రాంతులను చేయడం వంటి ఆరోపణలు రుజువయ్యాయి. మొత్తం 9 మందిపై చార్జ్ షీట్ దాఖలు కాగా, 8 మందిపై అభియోగాలు నిరూపితమయ్యాయి. తీర్పు అనంత‌రం రంగారెడ్డి కోర్టు నుండి దోషుల్ని జైలుకి తీసుకెళుతుండ‌గా పోలీసుల్ని నిందితుల కుటుంబ స‌భ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్నేక్ గ్యాంగ్ ముఠాకు వేసిన శిక్ష ప‌ట్ల వారి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చేశారు.

అయితే మంగళవారం నాడు అత్యాచార ఆరోపణలు రుజువు కాలేదని కోర్టు చేసిన వ్యాఖ్యల మీదట ఎలాంటి తీర్పు వస్తుందో అన్న సందేహం సర్వత్రా వ్యక్తమయ్యింది. అత్యాచార ఆరోపణలు రుజువు కాకపోతేనే యావజ్జీవ శిక్ష ఖరారు చేయడంతో, ఒకవేళ వాటిని కూడా సరైన సాక్ష్యాలతో రుజువు చేసినట్లయితే స్నేక్ గ్యాంగ్ కు సరైన శిక్ష పడేదన్న భావన బాధితుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ తీర్పు కూడా హర్షణీయమే అంటున్నారు సామాన్య ప్రజానీకం.