Hyderabad Police YS Sharmila Tow Car వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇంతకాలం సజావుగానే సాగిపోయింది. ఆమె తెలంగాణ సిఎం కేసీఆర్‌ని, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించినా ఎవరూ ఆమెను పట్టించుకోకపోవడమే కాకుండా ఆమె పాదయాత్ర నిరాటంకంగా సాగేందుకు ప్రభుత్వం సహకరించింది కూడా.

కానీ ఆమె నిన్న వరంగల్‌ జిల్లా నర్సంపేటలో పాదయాత్ర చేస్తుండగా టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఆమెను ఉద్దేశ్యించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె కూడా ఘాటుగా విమర్శించారు. దాంతో ఎమ్మెల్యే అనుచరులు ఆమె కారుపై కర్రలు, రాళ్ళతో దాడి చేసి అక్కడే ఉన్న ఆమె కార్వాన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పోలీసుల సమక్షంలోనే టిఆర్ఎస్‌ శ్రేణులు తనపై దాడులు చేయడంతో వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసీఆర్‌ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ వారిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

తన వాహనాలపై టిఆర్ఎస్‌ శ్రేణులు దాడి చేసి నిప్పు పెట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు ఉదయం వైఎస్ షర్మిల అదే కారును స్వయంగా నడిపించుకొంటూ, తన పార్టీ కార్యకర్తలతో కలిసి సిఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌ వద్దకు బయలుదేరారు. దారిలో రాజ్‌భవన్‌ రోడ్డులో పోలీసులు ఆమెను అడ్డుకొని కారులో నుంచి బయటకు రావాలని కోరారు. కానీ కారు డోర్స్ లాక్ చేసుకొని లోపలే కూర్చోవడంతో పోలీసులు కారుతో సహా ఆమెను టోయింగ్ వెహికల్ సాయంతో ఎస్సార్ నగర్‌ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీస్ స్టేషన్‌ చేరుకొన్నాక కూడా ఆమె కారులో నుంచి బయటకు రాకపోవడంటో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. ఈ హడావుడి కారణంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది.

ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “కేసీఆర్‌తో సహా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతీ ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజాధనం తినేస్తున్నారు. కనుక నేను నిలదీస్తే నాపై టిఆర్ఎస్‌ గూండాలని ఉసిగొల్పి దాడులు చేయిస్తారా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ గుండా రాజ్యం నడుస్తోంది,” అంటూ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.