hyderabad-police-seized-the-cashహైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ పరిధిలో భారీగా డబ్బు పట్టుబడింది. ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురు వ్యాపారుల నుంచి రూ.90.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా కాచీగూడ, సుల్తానాబాద్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు పోలీసులు చేపట్టారు. వేర్వేరుగా వాహనాల్లో నగదు తరలిస్తున్న వ్యాపారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీటికి నిందితులు ఎలాంటి ఆధారాలు చూపించలేదని, దీనితో కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు.

దేవేష్‌ కొటారి అనే వ్యక్తి వద్ద రూ.50 లక్షలు స్వాధీనం చేసుకోగా.. భక్తిప్రజాపతి వద్ద రూ.23 లక్షలు, నసీమ్‌ వద్ద రూ.5.70 లక్షలు, విశాల్‌ జైన్‌ వద్ద రూ.11.80 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. అయితే ఈ డబ్బు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుండి వస్తున్న సొమ్ము అని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే తెరాస వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు ఎన్నికలలో 2000 కోట్ల దాకా సాయం చేస్తుందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే అది తెరాస డబ్బయితే తెలంగాణ పోలీసులు పెట్టుకోరు కదా? ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా డబ్బు ప్రభావం గట్టిగానే కనిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణాలో డబ్బు ప్రభావం కొంత మేర తక్కువే ఉండేది. దీనితో ఇది తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీలు తరలిస్తున్న డబ్బు కూడా కావొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏప్రిల్ వరకు ఎన్నికల సంఘం దాదాపుగా 200 కోట్ల మేర డబ్బు పట్టుకునే అవకాశం ఉందని నిపుణుల అంచనా.