Hyderabad Police cracked down on 7.5Cr of Hawala cashతెలంగాణ ఎన్నికలకు ఒక నెల లోపే సమయం ఉంది. పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. మరోవైపు ఎన్నికలలో నగదు ప్రవాహం కొనసాగుతుంది. నిన్న ఒక్క రోజే ఏడున్నర కోట్ల డబ్బును కొందరి హవాలా వారి వద్ద పట్టుకున్నారు. రాజకీయ పార్టీలకు చేరవెయ్యడానికే ఈ నగదును సిద్ధం చేసినట్టు సమాచారం.

ఈ ఏడున్నర కోట్లతో ఇప్పటిదాకా తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక 62 కోట్లను పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. 2014 ఎన్నికల సందర్భంగా పోలీసులు 74 కోట్లు పట్టుకున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ఒక నెల ఉందనగానే ఆ అంకెను చేరుకుంటుంది. దీని బట్టి ఈ ఎన్నికలలో ధనప్రవాహం ఏ మేరకు ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

తెలంగాణ ఎన్నికలకు పోలింగ్ వచ్చే నెల 7న జరగబోతుంది. అదే నెల 11న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. మాములుగా ఎన్నికలు వచ్చే సంవత్సరం మేలో జరగాల్సి ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే అసెంబ్లీని రద్దు చెయ్యడం వల్ల అవి ముందుకు జరిగాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. మరో వైపు దాదాపు 35 ఏళ్లుగా దాయాదులుగా ఉన్న కాంగ్రెస్ టీడీపీలు ఈ ఎన్నికలలో కలిసి పోటీ చెయ్యబోతున్నాయి.