Coronavirus - hyderabad-లాక్ డౌన్ కి ఇచ్చిన సడలింపులు ఎఫెక్ట్ భారీగానే ఉంది. హైదరాబాద్ లోని ట్రాఫిక్ ని పరిశీలిస్తే దాదాపుగా సాధారణ పరిస్థితులు తలపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో వాహనాల రాకపోకలు తగ్గి వాయుకాలుష్యం చాలా పరిమితంగా ఉండేది. తాజాగా లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్ల మీదకు వచ్చేశాయి.

దీనితో వాయుకాలుష్యం బాగా పెరిగింది. కాలుష్యాన్ని బట్టి గ్రీన్, ఆరంజ్, రెడ్ జోన్లుగా విభజిస్తారు. లాక్‌ డౌన్‌కు ముందు (మార్చి 22కు ముందు) నగరంలోని సనత్‌నగర్‌ ప్రాంతంలో నమోదైన గాలి నాణ్యత 150 (మైక్రో గ్రామ్స్‌ ఇన్‌ క్యూబిక్‌ మీటర్స్‌) గా ఉండేది. ఆ తర్వాత అది 44 స్థాయికి తగ్గి గ్రీన్‌ జోన్‌లో ఉంది. సడలింపులతో వాహనాల రాకపోకలు పెరిగి ప్రస్తుతం 97కు పైకి చేరింది.

నగరంలో ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలు నడవడం లేదు. దీంతో సొంత వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. మరో నాలుగైదు రోజులలోనే లాక్ డౌన్ ముందు పరిస్థితికి చేరవచ్చని అంచనా. కాలుష్యం సంగతి పక్కన పెడితే ప్రజలు వైరస్ ని చాలా లైట్ గా తీసుకుంటున్నారని, దీనితో ప్రమాదం పొంచి ఉందని పలువురి ఆందోళన.

దానికి తోడు తెలంగాణాలో టెస్టింగ్ చాలా తక్కువగా ఉంది. దీనితో చాలా మంది కరోనా రోగులు మన మధ్యే తిరిగే అవకాశం ఉంది. విచ్చలవిడిగా తిరగేస్తే కేసులు విజృంభించే అవకాశం చాలా ఎక్కువ. ఇది ఇలా ఉండగా… ప్రభుత్వాలు మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. సోమవారం నుండి పాక్షికంగా దేశీయ విమానాలు తిరగబోతున్నాయి.