Coronavirus - hyderabad-కర్నాటకలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకరోజులో డెబ్బై మంది కరోనా బారిన పడి మరణించడంతో తిరిగి బెంగుళూరు తదితర ప్రాంతాలలో లాక్ డౌన్ పెడుతున్నారు. కొత్తగా 2798 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఈ నెల 14 సాయంత్రం ఎనిమిది గంటల నుండి 23 ఉదయం ఐదింటి వరకు సంపూర్ణ లాక్ డౌన్ అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం చెన్నై లో లాక్ డౌన్ విధించడంతో అక్కడ కేసులు బానే కంట్రోల్ లోకి వచ్చాయి. దీనితో హైదరాబాద్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తెర మీదకు వస్తుంది. తెలంగాణలో గతం రెండు మూడు రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయంలో నమ్మడం లేదు.

ఉద్దేశపూర్వకంగానే కేసులు తగ్గించి చూపిస్తున్నారనే అనుమానం అందరిలోనూ ఉంది. నిజమైన అబద్దమైన ఇప్పటికీ తెలంగాణలో నమోదు అవుతున్న కేసులలో ఎక్కువ శాతం హైదరాబాద్ లోనివే. దీనితో హైదరాబాద్ లో లాక్ డౌన్ పెట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఆలస్యమైతే జరిగే నష్టం భారీగా ఉంటుంది.

శనివారం రాత్రి వచ్చిన మెడికల్ బులెటిన్ ప్రకారం… తెలంగాణలోని కరోనా కేసుల సంఖ్య 33,402కు చేరాయి. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి కారణంగా 348 మరణాలు సంభవించాయి. నెల రోజులుగా తెలంగాణలో నమోదు అవుతున్న మొత్తం కేసులలో 85-90% కేసులు జీహెచ్ఎంసిలోనివే.