Hyderabad flood victims fires on KCRహైదరాబాద్ లోని పలు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి.. ప్రజల్లో తిరగాలని డిమాండ్ చేశారు. బూట్ పాలిష్ గ్యాంగ్‌ను పంపకుండా.. సీఎం స్వయంగా కాలనీల్లో పర్యటించాలన్నారు. లేకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

“గత ఆరేళ్లలో చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయి… దీనికి కేసీఆర్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే.. 67వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.. అవి ఏమయ్యాయో తెలపాలి. కాలనీలన్నీ మూసీ నదిలా మారాయి, కార్లన్నీ మునిగిపోయాయి. రేపటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు మునగడం ఖాయం,” అంటూ విరుచుకుపడ్డారు.

కేంద్రం సాయం చేయడానికి సిద్ధంగా ఉందని, ఐదువేల కోట్లు అడుగుతున్న కేసీఆర్.. కోవిడ్ నిధులు దారి మళ్లించారని ఫైర్ అయ్యారు. “అన్నీ కేంద్రం ఇస్తే… సీఎం ఎందుకున్నారని, ఎవరికోసం ఉన్నారు?,” అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తెరాస మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు.

“ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నీచ రాజకీయాలు మానుకుంటే బీజేపీ వారికి మంచిది. ప్రజాప్రతినిధులను బూట్ పాలిష్ గ్యాంగ్ అనడం ఘోరం. మేము కూడా మోడీ రావాలి బండి సంజయ్ లాంటి బూట్ పాలిష్ గ్యాంగ్ ని పంపడం కాదు అంటే? దేశంలోని ఒక ప్రధాన నగరం ఇంతటి విపత్తుని ఎదురుకుంటుంటే ప్రధానికి బాధ్యత ఉండదా? ఏదో నాలుగు తిట్లు తిడితే మీడియాలో కవరేజ్ వస్తుందని చేస్తున్న వ్యాఖ్యలుగా ఉన్నాయి ఇవి,” అని తెరాస మద్దతుదారులు విరుచుకుపడుతున్నారు.