Calvin and Wahid inquires continue in SIT Custodyతెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న మత్తు మందుల బాగోతంలో ప్రధాన నేరస్తుడు కెల్విన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే లభించదు గానీ, ఈ మొత్తం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పుతూ జవాబిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముఠా కేవలం ఎల్ఎస్డీకి చెందిన వారు మాత్రమేనని, అసలైన కొకైన్ బ్యాచ్ వేరే ఉందని, ఆ జాబితాలో చిత్ర పరిశ్రమతో పాటు, రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారి పిల్లలు కూడా ఉన్నారని సిట్ అధికారులకు చెప్పినట్లుగా సమాచారం.

బాలానగర్ లోని ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో ఈడీ అకున్ సబర్వాల్ స్వయంగా పాల్గొన్నారు. అసలు బ్యాచ్ వేరే ఉందని చెప్పిన కెల్విన్, సెలబ్రిటీలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అత్యధిక శాతం దాటవేసినట్టు సిట్ వర్గాలు తెలుపుతున్నాయి. కొకైన్ తీసుకోవడాన్ని ఉన్నత వర్గాల్లో స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారని, అందుకే బిగ్ షాట్స్ అంతా ఇందులో ఉంటారని చెప్పిన కెల్విన్, వారితో గల సంబంధాలపై మాత్రం పెదవి విప్పకపోవడం విశేషం.

దీనికి మరింత సమాచారం జీషన్ వద్ద ఉంటుందని, జీషన్ ను విచారిస్తే ఈ వ్యవహారంలో పెద్దల పేర్లు బయటకు వస్తాయని చెప్పడంతో, గత వారంలో ఓ స్టార్ హోటల్ సమీపంలో అరెస్ట్ అయిన జీషన్ ను కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారాంతాలతో పాటు, వినాయక నిమజ్జనాలు జరిగే చివరి నాలుగు రోజుల్లో ఎల్ఎస్డీ డ్రగ్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుందని, తాను ప్రతి నెలా గోవాకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటానని కూడా కెల్విన్ వెల్లడించినట్టు తెలుస్తోంది.