huzur-nagar-tdp-by-electionపూర్వవైభవం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టిన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. ఆ పార్టీ యువ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సోమవారం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వీరేందర్ గౌడ్ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కుమారుడు.

ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇటీవలే పూర్తి అయ్యింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న దేవేందర్ గౌడ్ పయనం ఎటు అనేది తెలీదు. తన రాజీనామా లేఖలో రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందని లేఖలో ఆయన విమర్శించారు. అయితే వీరేందర్‌ గౌడ్‌ అక్టోబర్ 3న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

2014లో ఉప్పల్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి వీరేందర్‌ భంగపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి అయిష్టంగానే పోటీ చేసి ఓటమి చవిచూశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ టిక్కెట్‌ కోసం ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చివరకు మహాకూటమి తరఫున పోటీ చేసినా గెలుపు దక్కలేదు.

ఆయన మీద తెరాస అభ్యర్థి సుభాష్ రెడ్డి 48,168 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014లో ఇదే బీజేపీతో పొత్తులో భాగంగా ఉప్పల్ సీటును వీరేందర్ గౌడ్ కు ఇవ్వలేకపోయారు చంద్రబాబు. అప్పుడు బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గెలిచారు. ఏది ఏమైనా తెలంగాణ టీడీపీకి హుజుర్ నగర్ ఎన్నికల ముందు ఇది నిరాశపరిచే వార్తే.