Huzoornagar-Election-Turned-Crucial-For-KCR-in-the-Last-Minuteతెలంగాణలో నిన్న హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ పూర్తి అయ్యింది. తాజాగా మరోసారి ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నీ కోర్టు కొట్టేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

రిజర్వేషన్లు, వార్డుల విభజనపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొన్ని నెలలుగా పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌, గ్రేటర్‌ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు.

దీంతో 10 నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 128 మున్సిపాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల పదవీ కాలం పూర్తి కాలేదు. అంతేకాకుండా కొన్ని సమస్యల వల్ల మరో ఐదు పురపాలక స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో ముందస్తు శాసనసభ ఎన్నికలకు వెళ్లడంతో డిసెంబర్ 2018 నుండి ఎన్నికల వాతావరం కనిపిస్తుంది. శాసనసభ ఎన్నికల తరువాత పంచాయతీ ఎన్నికలు, ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలు తాజాగా హుజూర్ నగర్ ఉపఎన్నిక జరిగాయి. ఇప్పుడు హై కోర్టు తీర్పుతో మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయి. దీనితో కొంత కాలం ఎన్నికల వేడి కొనసాగబోతుంది.