YS Avinash Reddyవివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి-సీబీఐ విచారణ-అరెస్ట్‌ వ్యవహారం టామ్ అండ్ జెర్రీ షోలా సాగుతోందని ముందే చెప్పుకొన్నాము. గత వారం నుంచి ఈ రెండో సీజన్‌ మొదలవగా నేడు సీబీఐ అధికారులు కర్నూలు చేరుకోవడంతో అకస్మాత్తుగా ఈ షో క్లైమాక్స్‌కు చేరుకొందని మీడియా కూడా గట్టిగా నమ్మేసి ప్రజలను కూడా నమ్మించేసింది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఈ టామ్ అండ్ జెర్రీ షో ఎప్పటిలాగే రేపు ఇంకా మరికొన్ని రోజులో… వారాలో… లేదా నెలలో కొనసాగబోతోందని స్పష్టమైంది. ఇంకా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా జరిగాయి.

అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి చికిత్స చేస్తున్న విశ్వభారతి హాస్పిటల్‌ పూర్తిగా వైసీపీ నేతల అధీనంలోకి తీసుకొన్నట్లు కనబడుతోంది. హాస్పిటల్‌ దరిదాపుల్లోకి వైసీపీ కార్యకర్తలను అనుమతించబోమని జిల్లా ఎస్పీ చెప్పినప్పటికీ హాస్పిటల్ చుట్టూ వారే కనిపిస్తున్నారు. అవినాష్ రెడ్డిని లొంగిపోవాలని సీబీఐ ఎస్పీని రెండుసార్లు వేడుకొన్నప్పటికీ కనికరించలేదు. ఈలోగా యధాప్రకారం అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసారు. ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేనందున ఆమె కోలుకొనే వరకు అవినాష్ రెడ్డి జోలికి సీబీఐని వెళ్ళనీయవద్దని కోరారు. దీనిపై రేపు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపడుతుంది.

ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హాస్పిటల్లో ఉన్న శ్రీలక్ష్మిని, ఆమె కుమారుడు అవినాష్ రెడ్డిని పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కర్నూలు వచ్చారు. వారు బంధువులు కనుక హాస్పిటల్లో ఉన్న ఆమెను పరామర్శించడానికి వచ్చారనుకొన్నప్పటికీ, అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసేందుకు కర్నూలులో ఎదురుచూస్తున్నప్పుడు విజయమ్మ హటాత్తుగా రావడం ఆశ్చర్యకరమే. తద్వారా అవినాష్ రెడ్డికి సంఘీభావం తెలిపిన్నట్లయింది.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేసిన్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు (అల్లర్లు) తల్లెత్తుతాయని, కనుక సీబీఐ ఆయనకు మరికొంత సమయం ఇవ్వాలని అన్నారు. ఓ హత్య కేసులో నిందితుడిని సీబీఐ అరెస్ట్‌ చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తల్లెత్తుతాయని చెప్పడం అరాచకానికి పరాకాష్ట అనుకోవాలేమో?

ఏది ఏమైనప్పటికీ సోమవారం ఉదయం మొదలైన హాటెన్షన్ డ్రామా సాయంత్రం అయ్యేసరికి రొటీన్‌గా ముగిసిపోయింది. కనుక ఈ షోలో ఇటువంటి ఎపిసోడ్స్ ఇంకా ఎన్ని చూడాలో?