How Jayalalithaa Diedడీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్… తన దూకుడును ఏ మాత్రం తగ్గించడం లేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి బల నిరూపణ చెల్లదంటూ కోర్టులో పిటిషన్ వేయడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు పలు సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. మన్నార్ గుడి మాఫియా పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటమే తన లక్ష్యమని, జైలు నుంచి రిమోట్ ద్వారా పాలనను కొనసాగిస్తున్న శశికళ బినామీ ప్రభుత్వాన్ని తరిమికొడదామంటూ తాజాగా ప్రజలకు పిలుపునిచ్చారు.

అడ్డ దారిలో ముఖ్యమంత్రిని కావాలన్న ఆలోచన తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేసిన స్టాలిన్, డీఎంకే అధికారంలోకి వచ్చి, తాను ముఖ్యమంత్రి అయితే… జయ మృతిపై విచారణ సంఘం ఏర్పాటు చేసే ఫైలు పైనే తొలి సంతకం చేస్తానని తెలిపారు. అన్నాదురై అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్పటి మంత్రి సాదిక్ బాషా ఎప్పటికప్పుడు సమాచారం అందించారని గుర్తు చేశారు. ఎంజీఆర్ అనారోగ్యం పాలైనప్పుడు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హండే ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు.

కానీ, జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి గురించిన సమాచారాన్ని అంత సీక్రెట్ గా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం కూడా పొంతన లేకుండా ఉందని, జయ మృతిపై విచారణ సంఘం ఏర్పాటు చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఒక విధంగా జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తే శశికళకు జీవిత ఖైదు ఖాయమని, తాము ఆందోళనలు చేస్తున్నది తమ కోసం కాదని అన్నారు.

ఇక, పళనిస్వామి మెజారిటీ నిరూపించుకున్న విధానంపై, ఆ రోజు స‌మావేశాలు జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, స్టాలిన్ నేతృత్వంలో పార్టీ నేత‌లు ఢిల్లీకి ప‌య‌నం కానున్నారు. గురువారం సాయంత్రం వారంతా రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖ‌ర్జీని క‌లిసి విశ్వాస ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌ రావుకి ఆదేశాలు చేయాల‌ని కోర‌నున్నారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు లేకుండా విశ్వాస ప‌రీక్ష జ‌ర‌గ‌డం స‌రికాద‌ని తమ వాదనను రాష్ట్రపతి ముందు వెల్లడించనున్నారు.