house hold surveyరాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సర్వే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. కేవలం రెండంటే రెండు రోజుల్లో రాష్ట్రం మొత్తం జనాభా యొక్క సమగ్ర వివరాలను సేకరించిన తెలంగాణా సర్కార్ సర్వే ఆదర్శప్రాయంగా నిలిచింది. అయితే ఈ సర్వేను తెలంగాణా సర్కార్ వినియోగించుకున్న విధానం విమర్శలకు తావిచ్చినప్పటికీ, సర్వే జరిపిన తీరుపై ప్రశంసలు కురిసాయి. తాజాగా ఇదే ఫార్ములాను ఏపీ సర్కార్ కూడా అవలంభించడానికి సిద్ధమవుతోంది.

అవును… ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర సర్వే నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సర్వేపై తెలంగాణా ప్రజల్లో ఉన్న అపోహల మాదిరే ఏపీ ప్రజల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుండి సమాచారం సేకరించిన తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పధకాలలో కోతలు పడతాయోమో అన్న ప్రశ్న ప్రజల్లో ఎక్కువగా వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన ప్రకటన చేసారు.

ఈ సమగ్ర సర్వే ద్వారా రిజర్వేషన్లు ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పధకాలలో ఎలాంటి వ్యత్యాసాలు ఉండబోవని, ఎవరూ భయాందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రజానీకం అంతా ప్రభుత్వానికి సహకరించి పూర్తి సమాచారం తెలపాలని పిలుపునిచ్చారు. మరి ఏపీ సర్కార్ అయినా చేపట్టిన సర్వే పేపర్లను సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి. తెలంగాణా సర్కార్ చేపట్టిన సర్వే పేపర్లు తర్వాతి కాలంలో కిరణా కొట్టులో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే!