Chandrababu naidu - Employeesరాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల పాటు ‘ఉమ్మడి రాజధాని’ హైదరాబాద్ నుండి పాలనను సాగించేందుకు వీలున్నా… అంతదాకా వద్దని, గుంటూరు జిల్లా తుళ్లూరు పరిధిలో అమరావతి పేరిట నిర్మాణం కానున్న రాజధానిలోనే పాలన సాగించాలని నిర్ణయించి, వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. శరవేగంగా జరుగుతున్న పనులు పూర్తి కావడానికి మరికొద్ది కాలమే మిగిలి ఉంది.

ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీలోగా సచివాలయ ఉద్యోగులంతా వెలగపూడికి తరలి రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విడతల వారీగా ఉద్యోగులు అక్కడికి తరలి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదలైన తరలింపులో భాగంగా ఉద్యోగులు కుటుంబాలతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయంలో మహిళా ఉద్యోగులు మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ప్రభుత్వానికి వివిధ సందర్భాలలో తన విజ్ఞప్తులను చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో వారి పరిస్థితిని గమనించిన చంద్రబాబు సర్కారు వారికో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. అమరావతి తరలివెళ్లే ఉద్యోగులకు ఆరు నెలల పాటు ఉచితంగా హాస్టల్ వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు మహిళా ఉద్యోగుల హాస్టల్స్ ను ఎంపిక చేసారు. ఈ హాస్టల్ సౌకర్యం కావాల్సిన ఉద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఉద్యోగుల కోసం ఇప్పటికే వారం రోజుల పని దినాలను 5 రోజులకు మార్చగా, ఇటీవలే ప్రత్యేకంగా ఒక రైలును కూడా వారి కోసం చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు ఏం కోరితే అవి ఇవ్వడానికి రెడీగా ఉన్న చంద్రబాబు సర్కార్, తాజాగా హాస్టల్ సదుపాయాన్ని కూడా కల్పించడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.