Home ministry issues notice to Rahul Gandhi over citizenshipకాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీ విదేశీ పౌరుడంటూ గత కొంతకాలంగా వస్తోన్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో వాస్తవాలేంటో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది. లండన్ లో ఒక కంపెనీ స్థాపన, ఐటీ రిటర్న్స్, ఆ కంపెనీ మూసివేసే క్రమంలో సమర్పించిన డాక్యూమెంట్లలో రాహుల్ తాను బ్రిటిష్ పౌరుడిగా చెప్పుకున్నట్టు ఆరోపణ.

రాహుల్‌ గాంధీ భారతీయుడు కాదని.. ఆయనకు బ్రిటిష్‌ పౌరసత్వం ఉందని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఆధారాలను 2015లో స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు ఆయన అందజేశారు. వాటి ఆధారంగా రాహుల్‌ను ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దీనిని అప్పట్లో రాహుల్ గాంధీ ఖండించారు. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సుబ్రహ్మణ్యస్వామి ఈ ఫిర్యాదు ఏడాది క్రితమే చెయ్యడం గమనార్హం.

సరిగ్గా ఎన్నికల సమయంలోనే దీనిని తెర మీదకు తీసుకోవడం అధికార పార్టీ ఉద్దేశాన్ని సూచిస్తుంది. దీనిద్వారా ఎన్నికలలో కాంగ్రెసును దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవలే అమేథీ ఎంపీగా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీక పై ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఇటువంటి ఆరోపణే చేశారు. ఆయన అఫిడవిట్ లో ప్రకటించినట్టుగా ఆయన భారత పౌరుడు కాదని ఆరోపించారు. అయితే దీనిని పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్ రాహుల్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.