History of 150 movies Megastar in dilemma ఈమధ్య ప్రేక్షకులు కటౌట్ ఎవరిదన్న దాన్ని బట్టి సినిమా చూడట్లేదు. కంటెంట్ ఉన్న సినిమాలో కటౌట్ ఎవరిదైనా సరే రైట్ రైట్ అనేస్తున్నారు. ఈ క్రమంలో మెగా కటౌట్ ఉన్నా సరే సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే థియేటర్లో ఈగలు తోలుకోవాల్సిందే. 150 సినిమాల చరిత్ర.. బాక్సాఫీస్ పై తిరుగులేని మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఆచార్య తెచ్చిన తిప్పలు అన్నీ ఇన్ని కావు.

తీసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ కొట్టిన సక్సెస్ ఫుల్ డైరక్టర్ కొరటాల శివ ఓ పక్క.. RRR తో అదరగొట్టిన చరణ్ స్వాగ్ మరో పక్క.. ఈ ఇద్దరి మధ్యలో తన పనితనం చూపించాలని వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్యగా చాలా నిరుత్సాహపరిచాడు. ఒకప్పుడు బాక్సాఫీస్ బాద్షాగా నిలిచిన చిరంజీవి.. ఆచార్యకు వస్తున్న వసూళ్లను చూసి షాక్ అవక తప్పదు.

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఏంటి ఇంత ఘోరంగా పడిపోవడం ఏంటని అనుకోవచ్చు. అదికూడా వారసుడితో చేసిన ఆచార్య ఇంత డిజాస్టర్ అవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కంటెంట్ లో మ్యాటర్ లేకపోతే అక్కడ ఎవరున్నా ఇదే ఫలితం వస్తుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. చిరు సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా సరే మెగా అభిమానుల అండదండలతో హిట్ చేసేస్తారు. ఆచార్య సినిమాకు వారు కూడా చేతులెత్తేశారు. ఆచార్య సినిమా ముందు మెగా ఫ్యాన్స్ నే మెప్పించలేకపోయింది.

చిరంజీవి, రాం చరణ్ కలిసి నటించిన ఆచార్యని ఏదో ఊహించుకుని వెళ్తే కొరటాల శివ ఇంకేదో చూపించాడు. అందుకే సినిమా ఫలితం ఇలా వచ్చింది. ఆచార్య సినిమా రిలీజ్ ముందు కూడా టికెట్ల విషయంలో కూడా ఆశించినంత బజ్ కనిపించలేదు. ఇందుకు కారణం వరుస భారీ సినిమాలతో ప్రేక్షకుల జేబులు ఖాళీ అవడమని చెప్పొచ్చు. అన్ని కలిసి ఆచార్య ని అడ్రెస్ లేకుండా చేశాయి.

ఖైదీ నెంబర్ 150 తో 10 ఏళ్ల తర్వాత అయినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్న చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో జస్ట్ ఓకే అనిపించుకున్నా ఆచార్యతో అందరికి డౌట్ కలిగించేశాడు. ఆచార్యలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా ఏదో మిస్ అయ్యిందని అనిపిస్తుంది. మరి ఆచార్య పరిస్థితే ఇలా ఉంటే రాబోతున్న రీమేక్ సినిమాలు గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాల సంగతి ఎలా ఉంటుందో చూడాలి.