Hindu Religion sentiment in Tirupati by elections2019 ఎన్నికలలో తిరుపతి లోక్ సభ స్థానం లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ ఈ సారి జనసేన మద్దతుతో గౌరవప్రదమైన ఓట్లు సాధించాలని ఆరాటపడుతుంది. ఒకపక్క జనసేన మద్దతుతో పాటు తమకు కలిసి వచ్చే హిందూ సెంటిమెంట్ ని కూడా రగల్చాలని బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇందులో భాగంగా తెలంగాణ బీజేపీ అధిపతి బండి సంజయ్ ని ప్రచారానికి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. బైబిల్‌ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలంటూ కొద్ది రోజుల కిందట ఆయన చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

కొంత మంది అటువంటి ప్రచారం ఏపీలో పనికిరాదు అని కూడా అన్నారు. అయితే పక్కా హిందూత్వ వాదిగా ముద్ర పడ్డ సంజయ్‌కి తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈ ప్రకటనతో అభిమానులు పెరిగారని బీజేపీ భావిస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో సంజయ్‌ లాంటి నాయకుల ప్రచారం తమకు గట్టి ఊతమిస్తుందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు.

అన్నీ కుదిరితే ఏప్రిల్‌ 14న తిరుపతిలో ఆయనతో భారీ ర్యాలీ చేయించాలని కమలనాథుల ఆలోచనగా ఉంది. ఏదో రకంగా ఈ ఎన్నికలలో తాము రెండవ స్థానంలో నిలిచి ఏపీ రాజకీయాలలో తామే నిజమైన ప్రత్యామ్న్యాయం అని చెప్పుకోవాలని వారు ఆరాటపడుతున్నారు.