Andhra_Pradesh_High_Courtఒక సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకి దక్కుతుంది. అదే.. ఫెయిల్ అయితే దర్శకుడుని అందరూ నిందిస్తారు. అదేవిదంగా ముఖ్యమంత్రులు తీసుకొన్న నిర్ణయాలు గొప్పగా ఉంటే ప్రజలు ముఖ్యమంత్రిని మెచ్చుకొంటారు. ఒకవేళ అది తప్పుడు నిర్ణయమైతే అధికారులు కోర్టులో మొట్టికాయలు వేయించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. ఈరోజు హైకోర్టులో రెండు వేర్వేరు కేసులలో ప్రభుత్వానికి మొట్టికాయలు పడ్డాయి.

ఒకటి ప్రజా ప్రతినిధులపై కేసులన్నీ ఉపసంహరించుకొంటూ జీవో జారీచేసినందుకు కాగా, మరొకటి విశాఖలో ఋషికొండను తవ్వేస్తుండటం గురించి.

మొదటి వ్యవహారంలో జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు తరపున ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్‌ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. హైకోర్టు అనుమతి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై కేసులను ఉపసంహరించుకొంటూ జీవో జారీచేసినందుకు దానిలో అభ్యంతరం తెలిపారు. దానిపై హైకోర్టు కూడా తీవ్రంగా స్పందిస్తూ, “మా అనుమతి లేకుండా కేసులు ఏవిదంగా ఉపసంహరించుకొంటుందో చెప్పాలని” ప్రభుత్వ న్యాయవాదిని గట్టిగా నిలదీసింది. తక్షణం ఆ జీవోను వెనక్కు తీసుకొని ఆ విషయాన్ని అఫిడవిట్ రూపంలో తమకు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా ప్రజా ప్రతినిధులపై కేసులను ఉపసంహరించుకొన్నట్లు తెలిస్తే దానిని కోర్టు ధిక్కార నేరంగా పరిగణించి చర్యలు తీసుకోవలసి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది.

మరో కేసు… విశాఖలో ఋషికొండను తవ్వేస్తుండటంపై అభ్యంతరం తెలుపుతూ టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేసినది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఋషికొండలో 9.88 ఎకరాలు తవ్వుకొనేందుకు అనుమతించగా ప్రభుత్వం 20 ఎకరాల వరకు తవ్వేసిందని తెలియజేస్తూ దీనికి సాక్ష్యంగా గూగుల్ ఫోటోలను కూడా జతపరిచారు.

ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డిని గట్టిగా నిలదీసింది. ‘ప్రభుత్వం అక్కడ చాలా పారదర్శకంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పుకొంటున్నప్పుడు, అక్కడ జరుగుతున్న పనులను చూసేందుకు ఎవరినీ ఎందుకు అనుమతించడం లేదని’ ప్రశ్నించింది. ‘అక్కడ జరుగుతున్న తవ్వకాలను పరిశీలించేందుకు కేంద్ర అటవీశాఖ కమిటీని ఏర్పాటు చేస్తి పంపిస్తానంటే ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెపుతోందని’ హైకోర్టు ప్రశ్నించింది. ‘రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే అక్కడ ఏదో దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తునట్లు అనుమానం కలుగుతోందని’ న్యాయమూర్తులు అనగా ‘అనుమతించిన మేరకే ప్రభుత్వం తవ్వకాలు జరుపుతోందని’ న్యాయవాది సర్దిచెప్పబోగా ‘అయితే గూగుల్ ఫోటోలు అబద్దం చెపుతున్నాయా?’అని న్యాయమూర్తులు ఎదురు ప్రశ్నించారు. దాంతో ప్రభుత్వ న్యాయవాది వెనక్కు తగ్గి తనకు కొంత సమయం ఇస్తే అఫిడవిట్ దాఖలు చేస్తానని అభ్యర్ధించారు. న్యాయమూర్తులు అందుకు అంగీకరించి ఈ కేసు తదుపరి విచారణను నవంబర్‌ 3కి వాయిదా వేశారు.

హైకోర్టులో అధికారులు భరిస్తున్న ఈ మొట్టికాయలు, ఎదుర్కొంటున్న ఈ చేదు అనుభవాలు ముఖ్యమంత్రికి, మంత్రులకి ఎదుర్కోవలసిన అవసరం లేదు. కనుక వారి నిర్ణయాలు వారు తీసుకొంటుంటే, హైకోర్టులో అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు ఇలా మొట్టికాయలు వేయించుకోక తప్పడం లేదు.