High court verdict on TV9 Ravi Prakash (1)టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జైలులో ఉండగానే ఆయనను మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా కేసు ఫేక్‌ ఐడీ కేసు కావడం విశేషం. దీనిపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు అంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఆశ్చర్యంగా ఉన్నాయి. అలాగే రవిప్రకాష్ కు నైతికంగా బలం చేకూర్చేవిగా ఉన్నాయి.

రవిప్రకాష్ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యిందని ఆ వార్తల సారాంశం. ఒక మనిషిని ఎంతలా హింస పెడుతారని ప్రశ్నించింది. రవిప్రకాష్‌ను జీవితాంతం జైల్లో పెడుతారా? అని హైకోర్టు నిలదీసింది. పోలీసులు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తే.. కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించిందట.

అదే సమయంలో రవిప్రకాప్‌పై నమోదైన కేసులు వివరాలను.. మంగళవారంలోగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హై కోర్ట్ చేసిందని చెప్పబడుతున్న ఈ వ్యాఖ్యలు రవిప్రకాష్ టీం చేస్తున్న కక్షసాధింపు కేసుల ఆరోపణలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. రవిప్రకాష్ కు కష్టకాలంలో ఇవి ఊరటనిచ్చేవే.

ఒక కేసులో బెయిలు వచ్చినా మరో కేసులో ఆయన లోపల ఉండేలా జరుగుతున్న కుట్రలో భాగంగా ఈ కేసులు బనాయిస్తున్నారని రవిప్రకాష్ ఆరోపిస్తున్నారు. మరోవైపు టీవీ9 కొత్త మానేజ్మెంట్ లో పార్టనర్ ఐన మేఘ కృష్ణారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 6 రోజులుగా ఇండ్లు, కార్యాలయాలు జల్లెడ పట్టిన ఐటీ అధికారులు… మెఘా కృష్ణారెడ్డిని రెండు రోజులుగా ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారని సమాచారం.