High court vedict on Sye Raa Narasimha Reddy మరి కొన్ని గంటలలో మెగాస్టార్ చిరంజీవి మొదటి హిస్టారికల్ సినిమా, సైరా అమెరికా ప్రీమియర్లు మొదలు కాబోతున్నాయి. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు సినిమాకు సంబంధించిన అన్ని లీగల్ చిక్కులు వీగిపోయాయి. సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలను తాము ఆపలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని మొదట బయోపిక్ అని చెప్పి.. ఇప్పుడు చరిత్ర అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ తమిళనాడు తెలుగు యువత సంఘం నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.సినిమాను కేవలం వినోదం పరంగానే చూడాలని కోర్టు పిటీషర్ కు హితవు పలికింది.

మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లు ఎవరూ చూపించలేరని, సినిమాటిక్‌గా ఉండడం కోసం కొంత కల్పితం కూడా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలో గాంధీజీ, మొగల్ సామ్రాజ్యం విషయంలో కూడా కల్పితం ఉందంటూ హైకోర్టు వివరించింది. సినిమా నచ్చేది, నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలని పిటిషనర్‌కు న్యాయస్థానం సూచించింది.

ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీకులు తమకు పరిహారం చెల్లించాలి అంటూ వేసిన కేసులు కూడా విరమించుకున్నారు. దీనితో సినిమాకు ఎటువంటి ఇబ్బందులు లేవనే చెప్పాలి. సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. ఇందులో అగ్రభాగం తెలుగు నుండే రావాలి.