High Courtఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడినవారి కోసం, పార్టీలో రాజకీయ నిరుద్యోగులు పక్కచూపులు చూడకుండా ఉంచేందుకు ప్రభుత్వంలో కొత్త కొత్త కార్పొరేషన్లు, పదవులు సృష్టించడం ఇప్పుడు పరిపాటిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇది మరింత ఎక్కువైంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బలమైన మునిసిపల్, రెవెన్యూ వ్యవస్థలు ఉండగా ప్రభుత్వం వాటికి సమాంతరంగా సచివాలయ వ్యవస్థలని, వాటికి అనుబందంగా వాలంటీర్ వ్యవస్థలని నెలకొల్పి వాటిపై ఏటా వేలకోట్లు ఖర్చుచేస్తోంది. ప్రభుత్వంలో ప్రతీ శాఖకి మేధావులు, అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారులు కార్యదర్శులుగా ఉన్నప్పటికీ డజన్ల కొద్దీ సలహాదారులని నియమిస్తూ వారికి ఏటా వందల కోట్ల జీతభత్యాలు చెల్లిస్తోంది. ఈ అదనపు భారం కారణంగానే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి నెలనెలా సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. ఈ సమాంతర వ్యవస్థల వలన ప్రభుత్వం అదనపు ఆర్ధికభారం పడుతున్నప్పటికీ, హైకోర్టు పదేపదే అభ్యంతరం చెపుతున్నప్పటికీ, ప్రభుత్వం తీరు మారడం లేదనడానికి తాజా నిదర్శనంగా టాలీవుడ్‌ హాస్య నటుడు అలీ నియామకం కనిపిస్తోంది.

కొన్ని నెలల క్రితం జ్వాలాపురపు శ్రీకాంత్‌ని దేవాదాయశాఖ సలహాదారుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ఏపీ భ్రాహ్మణసేవా సంఘాల ప్రతినిధి రాజశేఖర్ రావు హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టినప్పుడు ఆసక్తికరమైన పరిణామం జరిగింది.

అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా ఎన్‌.చంద్రశేఖర్ రెడ్డిని నియామకాన్ని సవాలు చేస్తూ మునెయ్య అనే ఓ రిటైర్డ్ ఉద్యోగి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నిన్న హైకోర్టు దేవాదాయశాఖ సలహాదారు నియామకంపై విచారణ జరుపుతున్నప్పుడు ఎన్‌.చంద్రశేఖర్ రెడ్డి తరపు న్యాయవాది కూడా మద్యలో వచ్చి చేరారు. తమకి నోటీస్ అందకపోవడంతో ఈ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతున్నట్లు మీడియా ద్వారా తెలుసుకొని వచ్చామని చెప్పారు.

దానిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపి, ప్రభుత్వం తీరు చూస్తుంటే రేపు ఉద్యోగుల టీఏ, డీఏలు చెల్లించడానికి కూడా సలహాదారులని నియమించుకొంటుందేమో?అని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులతో ఇలా సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేయడం చాలా ప్రమాదకరమని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సలహాదారుల నియామకాల రాజ్యాంగబద్దతని తామే తేల్చుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నియమించుకొన్న సలహాదారుల పేర్లు, వారి జీతభత్యాల పూర్తి వివరాలని హైకోర్టుకి సమర్పించాలని అడ్వకేట్ జనరల్‌ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు ఆయన మరికొంత సమయం కోరగా హైకోర్టు అంగీకరించింది.

దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ ఆ పదవిలో కొనసాగేందుకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులని మరోసారి హైకోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసు తదుపరి విచారణని ఫిభ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

ఈ సమాంతర వ్యవస్థలకి రాజ్యాంగ బద్దత లేదనేది సుస్పష్టం. కనుక హైకోర్టు పూనుకొంటే ఒకే ఒక తీర్పుతో వీటన్నిటినీ తొలగించగలదు. అయితే ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఎందుకని సంయమనం పాటిస్తోంది. కానీ ఈ నియామకాలని హైకోర్టు చూసీ చూడనట్లు ఊరుకొంటున్నప్పటికీ, వాటిపై అభ్యంతరాలు తెలుపుతూ పిటిషన్లు దాఖలావుతూనే ఉండటంతో హైకోర్టు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.